విజయవాడలో బోర్డు ఏర్పాటుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదన
ఉపయోగం ఉండదంటున్న నిపుణులు
సాక్షి, విజయవాడ : కృష్ణానదీ జలాల బోర్డును విజయవాడలో ఏర్పాటుచేయాలని ఇరిగేషన్ శాఖ పంపిన ప్రతిపాదనలపై నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు. కృష్ణాడెల్టాకు దీనివల్ల ఏమేరకు లబ్ధి చేకూరుతుందనేది చర్చనీయాంశమైంది. కృష్ణానదిపై అంతర్‌రాష్ట్ర వివాదాలు ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పరిమితమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
కృష్ణా యాజమాన్య బోర్డు నీటి లభ్యతను బట్టి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపు, వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. బోర్డు విధివిధానాలు, పరిధి, నీటి లెక్కింపు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ, వరద నిర్వహణ, నీటి యాజమాన్యానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు కృష్ణాడెల్టా అవసరాలు, సాగర్ నుంచి ఎంత నీటిని విడుదల చేయాలి, దిగువన ఎంత నీరు వస్తుందన్న అంశాలపై లెక్కలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే సంక్షోభంలో కృష్ణా డెల్టా...
13 లక్షల ఎకరాల్లో వరి సాగవుతూ దక్షిణ భారతదేశపు అన్నపూర్ణగా పేరొందిన కృష్ణాడెల్టా.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒక్క చుక్క కూడా ఉపయోగపడని మునేరు, పాలేరు జలాలను నికర జలాలుగా బ్రిజేష్ ట్రిబ్యునల్ లెక్కల్లో చూపించిన సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ దిగువ భాగంలోని పరీవాహక ప్రాంతంలో మునేరు, పాలేరు నదుల నుంచి వచ్చే 50 టీఎంసీల నీటిని నికర జలాలుగా లెక్కగట్టారు.
కృష్ణా నదిలో వరదలు వచ్చే సమయంలోనే మునేరు, పాలేరు ఉపనదుల నుంచి వరద ప్రవాహం కృష్ణానదిలో చేరుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల కన్నా ఎక్కువ నీరు నిల్వ చేసే అవకాశం లేకపోవడం వల్ల వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదలడం మినహా డెల్టాకు ఉపయోగించిన దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో పులిచింతలలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే కృష్ణాడెల్టాకు జూన్, జూలై నెలల్లో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పులిచింతలలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంచాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. మిగులు జలాలపై పూర్తి హక్కు ఉన్నప్పుడే 2002, 2003 సంవత్సరాల్లో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 20 లక్షల ఎకరాల్లో పంట పండని పరిస్థితి ఏర్పడింది. ఆల్మట్టి ఎత్తు పెంచడం కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.
2003-04లో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆల్మట్టిలో 137 టీఎంసీల నీరు ఉన్నా 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదు. భవిష్యత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండదని గ్యారెంటీ లేదు. పైనుంచి నీరు రాకపోతే ఇక్కడ బోర్డు ఉన్నా నీటిని సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది.
‘కృష్ణా బోర్డు’తో డెల్టాకు లబ్ధి చేకూరేనా?
Published Sat, May 10 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement
Advertisement