అక్రమ కేసులు ఎత్తివేయాలి
Published Thu, Nov 7 2013 1:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ :రైతు నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కేఎస్‌ఈ జడ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యతిరేక పోరాట కమిటీ బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ఎస్‌ఈజెడ్ బాధితుల తరఫున పోరాడుతున్న రైతు నాయకుడు పెనుమళ్లు సుబ్బిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు.
కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా అరెస్ట్ చేయరాదన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించలేదని ఆరోపించారు. అక్రమ అరెస్టు చేసిన కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని, రిటైర్డ్ డీఎస్పీ హర్షవర్ధన్‌పై కేసు నమోదు చేయాలని, సుబ్బిరెడ్డిపై బనాయించిన ఐదు కేసులను ఎత్తివేయాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా భూసేకరణ చేపట్టిన అప్పటి జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్ చర్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు కలెక్టర్ నీతూప్రసాద్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు రాజేంద్ర, సూర్యనారాయణమూర్తి, నారాయణస్వామి, వీరబాబు, టీడీపీ నాయకుడు వర్మ, బీజేపీ నాయకులు పద్మారెడ్డి, బీఎస్పీనాయకుడు చొల్లంగి వేణుగోపాల్ పాల్గొన్నారు.
భూసేకరణ చట్టబద్దంగానే జరిగింది
కాకినాడ సెజ్‌లో భూసేకరణ అంతా చట్టబద్దంగానే జరిగిందని కేఎస్‌ఈజెడ్ ప్రతినిధులు బుధవారం పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరు హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టు సెజ్ కోసం భూముల కొనుగోలు చట్ట ప్రకారమే జరిగినట్టు తీర్పునిచ్చిందని తెలిపారు. చందు హర్షవర్ధన్ రక్ష సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో విధులు నిర్శహిస్తుండేవారని, విధి నిర్వహణలో భాగంగానే సెజ్ భూములను పర్యవేక్షించారు తప్ప పోరాట కమిటీ ఆరోపణలు సత్యదూరమన్నారు. సుబ్బిరెడ్డి అరెస్టు కేసుకు కాకినాడ సెజ్‌కు ఎటువంటి సంబంధం లేదని ఎస్‌ఈజడ్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.
Advertisement
Advertisement