తండ్రిని చంపిన తనయుడు అరెస్టు | Father kills son arrested | Sakshi
Sakshi News home page

తండ్రిని చంపిన తనయుడు అరెస్టు

Published Thu, Jan 1 2015 6:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Father kills son arrested

  • ఆస్తి తగాదాలే హత్యకు కారణం
  • కోడలు పాత్రపై అనుమానాలు
  • మైదుకూరు టౌన్: తండ్రిని చంపిన కేసులో ఆయన తనయుడు ముద్దంశెట్టి శివప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడపలో లక్ష్మిభవన్ హోటల్ నిర్వహిస్తున్న ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్య(64)ను అతని కొడుకు శివప్రసాద్, అతని అన్న బావమరిది మైలారు జగన్నాథం కలిసి పథకం ప్రకారం హత్య చేశారన్నారు.

    వెంకటసుబ్బయ గత కొద్ది సంవత్సరాలుగా కడపలో లక్ష్మిభవన్ హోటల్‌ను నిర్వహిస్తూ మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె ప్రాంతంలో పొలాలను కొనుగోలు చేసి సాగుచేసుకుంటూ ఉండేవాడన్నారు. ఇతనికి నాగరాజు, శివప్రసాద్ అనే కుమారులతో పాటు కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. 2008వ సంవత్సరంలో పెద్ద కుమారుడు నాగరాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. శివప్రసాద్ బీటెక్ చదివి హైదరాబాద్‌లో ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

    ఈ క్రమంలో ఆస్తి పంపకం విషయమై శివప్రసాద్ తండ్రితో తరచూ ఘర్షణకు దిగేవాడు. పెద్ద మనుషులు పంచాయతీ చేసినప్పటికీ ఆస్తి పంపకం చేయకపోవడంతో తండ్రిపై ద్వేషం పెంచుకున్న శివ ప్రసాద్ ఎలాగైనా తండ్రిని అడ్డుతొలగించుకోవాలని భావించి తన అన్న బావమరిదైన జగన్నాథంతో కలిసి హత్యకు పథకం రూపొందించాడు. ఈ తరుణంలో ఆదివారం వారు హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనంలో  రెండు వేటకొడవళ్లు పెప్పర్ స్ప్రేతో మైదుకూరుకు చేరుకున్నారు.

    మంగళవారం ఉదయం వెంకటసుబ్బయ్య కడప నుంచి తిప్పిరెడ్డి పల్లె సమీపంలో ఉన్న పొలం వద్దకు చేరుకోగా విషయం తెలుసుకున్న శివప్రసాద్, జగన్నాథంలు తోటలోని అరటి  చెట్లమాటున మాటువేసి కూర్చున్నారు. వెంకటసుబ్బయ్య పొలం పనులు ముగించుకొని సాయంత్రం కడపకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా హఠాత్తుగా వెంకటసుబ్బయ్యపై శివ, జగన్నాథంలు దాడిచేసి పెప్పర్ స్ప్రే చేశారు. వెంకటసుబ్బయ్య వారితో పెనుగులాడగా శివ వెంకటసుబ్బయ్య మెడ భాగంపై వేటకొడవలితో నరికి కిరాతకంగా హత మార్చాడు.

    నిందితులు ఇద్దరు నేరుగా ద్విచక్రవాహనంపై మైదుకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ మేరకు తోట కాపలాదారుడు మహేష్ ఫిర్యాదు మేరకు శివ, జగన్నాథంలపై  కేసు నమోదు చేశామన్నారు. వెంకటసుబ్బయ్య హత్య విషయంలో కోడలు సుప్రజ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి ద్విచక్రవాహనం, రెండువేట కొడవళ్లు, పెప్పర్ స్ప్రేను స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆయన వివరించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement