ఆధిపత్యపోరే ప్రాణం తీసింది
ఆధిపత్యపోరే ప్రాణం తీసింది
Published Sat, Apr 8 2017 2:04 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
ఏలూరు అర్బన్ : గుడివాకలంక మాజీ సర్పంచ్, కొల్లేరు నాయకుడు భద్రగిరిస్వామి హత్య కేసులో నలుగురు నిందితులను వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. భద్రగిరిస్వామికి అదే గ్రామానికి చెందిన మోరు రామకృష్ణకు మధ్య చాలా కాలంగా గ్రామంలో ఆధిపత్య పోరు సాగుతోంది. 2013 పంచాయతీ ఎన్నికల్లో రామకృష్ణ గ్రామ కట్టుబాటుకు వ్యతిరేకంగా పోటీకి దిగాడు. దీంతో భద్రగిరి, గ్రామపెద్దలు రామకృష్ణను పోటీ నుంచి వైదొలగాలని కోరారు. అందుకు రూ.10లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ రామకృష్ణ అందుకు అంగీకరించలేదు. ఎన్నికల్లో పోటీ చేశాడు. దీంతో గ్రామ కట్టుబాటును ధిక్కరించాడనే కారణంగా అతనిని గ్రామస్తులు కలుపుకోవడం లేదు. అదే క్రమంలో భద్రగిరిస్వామి తన భార్యతో పోలీసు కేసు పెట్టించి తనను భార్య నుంచి వేరు చేశాడని రామకృష్ణ భావించాడు. దీనివల్ల తన కుటుంబానికి దూరంగా ఏలూరులో ఉండాల్సి వస్తోందని మనస్థాపం చెందాడు. భద్రగిరిస్వావిుపై రామకృష్ణ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన ఇబ్బందులు తొలగాలన్నా.. రాజకీయంగా ఎదగాలన్నా.. భద్రగిరిని హతమార్చడమే పరిష్కారమని రామకృష్ణ నిర్ణయించుకున్నాడు.
కిరాయి వ్యక్తిని పురమాయించి..
అనుకున్నదే తడవుగా విజయవాడలోని పాత పరిచయస్తుడు మేరుగు వెంకటేశ్వరరావును కలిసి తన బాధ చెప్పుకున్నాడు. భద్రగిరిస్వామి హత్యకు మనుషులను పురమాయించాలని కోరాడు. దీనికి అంగీకరించిన వెంకటేశ్వరరావు విజయవాడలో జులాయిగా తిరుగుతున్న గుడిసేవ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని పురమాయించాడు. రూ. లక్షా50వేలకు బేరం కుదిర్చాడు. ఈ క్రమంలో రామకృష్ణ మేనల్లుడు ఘంటసాల సాల్మన్ రాజు, కిరాయి హంతకుడు సుబ్రహ్మణ్యంను గుడివాకలంక గ్రామానికి తీసుకువెళ్లి భద్రగిరిస్వామిని, అతను నివాసం ఉండే ఇంటిని చూపించాడు. దీంతో పథకం రూపొందించుకున్న హంతకుడు ఈనెల 30న ఏలూరు ఎంపీడీవో కార్యాలయానికి కారులో బయలుదేరిన భద్రగిరిస్వామిని వెనుక మరో కారులో అనుసరించాడు. ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన భద్రగిరి స్వామిని అక్కడే ఎదురుగా వెళ్లి తలను చేతిలో ఇరికించుకుని వెంట తెచ్చుకున్న చురకత్తితో మెడను కోసి హత్య చేసి అక్కడే సిద్ధంగా ఉన్న మోటారు బైక్‌పై పరారయ్యాడు.
యుద్ధప్రాతిపదికన దర్యాప్తు
జిల్లా రాజధాని ఏలూరు నడిబొడ్డున హత్య జరగడంతో కేసును ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్సై కె.రామారావు, త్రీ టౌన్ ఎస్సై ఎం.సాగర్‌బాబు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించారు. రామకృష్ణతోపాటు, అతని మేనల్లుడు సాల్మన్‌రాజును, కిరాయి హంతకుడిని కుదిర్చిన వెంకటేశ్వరరావును, హంతకుడు సుబ్రహ్మణ్యంను శనివారం విజయవాడలో అరెస్ట్ చేశారు. రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించిన సీఐ రాజశేఖర్, ఎస్సైలు రామారావు, సాగర్‌బాబు, సిబ్బంది దిలీప్ కుమార్, రఫీ, బాజీ, నాగరాజును డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement
Advertisement