హత్యకేసులో నిందితుడి అరెస్టు
హత్యకేసులో నిందితుడి అరెస్టు
Published Sat, May 6 2017 11:38 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
రాజోలు : నాలుగేళ్ల క్రితం మలికిపురం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పట్టపగలు ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ హత్యతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2012 ఆగస్టు 28 మధ్యాహ్నం మలికిపురం సూర్యా లాడ్జి సమీపంలో రెండస్తుల డాబా ఇంటిలో నివాసం ఉంటున్న సఖినేటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే మారే కార్తీక్ భార్య మారే దుర్గాకుమా రి(28)ని మలికిపురం మండలం బట్టేలంక గ్రామానికి చెందిన కొల్లి రామకృష్ణ హత్య చేశాడు. ఎట్టకేలకు నిందితుడు పోలీసులకు చిక్కాడు. అమలాపురం డీఎస్పీ ఎల్. అంకయ్య, సీఐ క్రిష్టోఫర్‌లు శనివారం వివరాలు వెల్లడించారు. నాలుగేళ్ల నుంచి ఈ హత్య కేసులో ఆధారాలు కోసం విచారణ చేస్తూనే ఉన్నారు. తరచూ సూర్యా లాడ్జికి వెళ్లే రామకృష్ణ సమీపంలోని డాబాపై ఒంటరిగా కూర్చుని వున్న దుర్గాకుమారిని గమనించాడు. పేకాటలో సొమ్ములు పోగొట్టుకున్న రామకృష్ణ ఎవరూ లేని సమయంలో స్వీట్స్ ప్యాకెట్ పట్టుకుని దుర్గాకుమారి ఇంటికి వెళ్లి బంధువుగా పరిచయం చేసుకున్నాడు. దుర్గాకుమారి టీ ఇచ్చి గౌరవించింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్టు నటించి మెడలో ఉన్న బంగారు హారాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు. దుర్గా కుమారి కేకలు వేయడంతో ఆమె గొంతు నులిమి మంచంపై పడవేసి తలగడతో ఊపిరి ఆడకుండా చేసి అంతమొందించాడు. నిందితుడు రామకృష్ణ నుంచి పోలీసులు 30 గ్రాముల బంగారు నెక్లెస్, ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. అంతర్వేది నీలకంఠేశ్వరస్వామి ఆలయంతో పాటు మోరి, శంకరగుప్తం గ్రామాల్లో రెండు చోట్ల, లక్కవరంలోని బ్రాందీషాపులో దొంగతనాలకు పాల్పడినట్టు డీఎస్పీ వివరించారు. నిందితుడు పోలీసుల కదలికలు కనిపెడుతూ వారి కన్నుగప్పి మలికిపురం, బట్టేలంక, లక్కవరం తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. ఏదైనా కేసు కోసం పోలీసులు ఆయా గ్రామాల్లోకి వస్తే ఆ సమయంలో దూర ప్రాంతాలకు పారిపోయేవాడు. ఇలా ఉండగా బంగారు వస్తువులకు మెరుగు పెట్టి మోసాలకు పాల్పడుతున్న చిత్తూరు ముఠా కోసం మలికిపురం ఎస్సై విజయ్‌బాబు ఆరా తీస్తున్న సమయంలో బట్టేలంక గ్రామానికి చెందిన కొల్లి రామకృష్ణపై అనుమానం కలిగింది. ఆరు నెలల నుంచి రామకృష్ణ కదలికలపై నిఘా ఉంచారు. బంగారం మెరుగు మోసాలకు పాల్పడుతున్నాడనుకుని పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. బంగారం మెరుగు ముఠాతో తనకు సంబంధం లేదని, బంగారం కోసం 2012 ఆగస్టు 28న మలికిపురంలో మహిళను హత్య చేసినట్టు చెప్పాడు. నాలుగేళ్ల నుంచి పోలీస్‌లకు సవాల్‌గా మారిన కేసును చేధించిన మలికిపురం ఎస్సై విజయ్‌బాబు, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ బొక్కా శ్రీనివాస్, కానిస్టేబుళ్లు బి.సుబ్బారావు, వీరేంద్రకుమార్, జయరాంలను డీఎస్పీ అంకయ్య అభినందించారు.
Advertisement