కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు
హైదరాబాద్ : తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్న బాలికను జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు కాపాడి రెస్క్యూ హోంకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీ నగర్ బస్తీలో నివసించే ఓ బాలిక(12)ను గత కొద్ది రోజులుగా తండ్రి షేక్ సల్మాన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆ బాలిక చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలిపింది.
వారి ద్వారా ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలికి విషయం తెలిసి ఆరా తీశారు. ఆమె శిథూర్ చైల్డ్ లైన్ సంస్థ కో-ఆర్డినేటర్ చిన్నబాబు, జిల్లా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది నర్సింహులతో కలసి గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వినోద్‌కుమార్‌తో కలసి వారంతా బాలిక ఇంటికి వెళ్లారు. అప్పటికే విషయం తెలుసుకున్న తండ్రి సల్మాన్ అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లికి సమాచారం ఇచ్చి నిర్వాహకులు బాలికను నింబోలి అడ్డాలోని ప్రభుత్వ బాలికల వసతి గృహానికి తరలించారు. ఆమె చదువుకుంటానంటే అక్కడే ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.