
సాక్షి, గన్నవరం : ఆడిపిల్లగా జన్మించడమే ఓ చిన్నారికి శాపంగా మారింది. ఎనిమిది రోజుల పసికందును బేరానికి పెట్టాడు ఓ తండ్రి. ఆసుపత్రి నుండి ఇంటికి కూడా తీసుకువెళ్లక ముందే చిన్నారిని లక్షన్నరకు బేరం కుదుర్చుకున్నాడు. అల్లుడు పసిపాను బేరం పెట్టిన విషయాన్ని గమనించిన మామ నిలదీయడంతో కంగుతున్నాడు. ఈ అమానుష సంఘటన కృష్ణాజిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థ నగర్ కు చెందిన రాజేష్ నాలుగేళ్ళ క్రితం బాపులపాడు మండలం సింగన్నగూడెంకు చెందిన రజితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రజిత తండ్రి సవనాద్రికి ప్రేమ వివాహం ఇష్టం లేకపోయినా కూతురు సుఖంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అంగీకరించాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన రజిత మూడేళ్ల క్రితం మొదటి కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది.
రెండవ కాన్పుగా వారం క్రితం గన్నవరం పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్ లో ఇద్దరు ఆడకవలలకి జన్మనిచ్చింది. ఆడ పిల్లలంటే ఇష్టం లేని రాజేష్ ఇద్దరు ఆడపిల్లలు ఒకే కాన్పులో జన్మించడంతో ఒక చిన్నారిని భీమవరానికి చెందిన వారికి అమ్మేయడానికి రంగం సిద్ధం చేసాడు. అల్లుడు ప్రవర్తనను గమనించిన మామ సవనాద్రి అల్లుడితో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో అక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం విషయం తెలుసుకునేలోపు రాజేష్ అక్కడ నుండి జారుకున్నాడు. రజిత తండ్రి మాత్రం ఎంతమంది పిల్లలు అయినా తాను చూసుకుంటాని తెలిపాడు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన రాజేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment