ఫాతిమా మెడికల్ కాలేజ్
సాక్షి కడప : ఎన్నో ఆశలతో విద్యా సంవత్సరం ప్రారంభించిన ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు ఆది నుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చదివించేందుకు సిద్ధమైనా.. సంబంధిత యాజమాన్యం ఎం సీఐ అనుమతి వ్యవహారం చెప్పకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు అలుముకున్నాయి.అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం వారిని పట్టించుకోకపోవడంతో త్రిశంకుస్వర్గంలో నలిగిపోతున్నారు. ‘ఫాతిమా’యాజమాన్యం చేతిలో చిక్కుకుపోయిన విద్యార్థులకు న్యాయం కరువైంది. ఎవరి వద్దకు వెళితే వారికి న్యాయం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు. 2015–16 సంవత్సరానికి సంబంధించి కళాశాలలో చేరిన తర్వాత కొద్దిరోజులకే ఎంసీఐ అనుమతి లేదని తెలియడంతో విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన వారు.. మరో రెండేళ్లు చదువును కోల్పోయారు.
అప్పటినుంచి సుమారు 90 మంది విద్యార్థులు ఆం దోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు ఎంసీఐ, కేంద్రం చర్చిస్తున్నామని చెబు తున్నారే తప్ప ఇప్పటివరకు వారికి మాత్రం మెడికల్ కళాశాలలో చేరేందుకు అవకాశం కల్పించలేదు. వైద్య విద్యార్థులు మాత్రం తిరిగని చోటులేదు..చేయని ప్రయత్నమూ లేదు.వారి కలల సౌధమైన ఎంబీబీఎస్ సీటు సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మెడికల్ సీట్లు పొందినా..దురదృష్టం కొద్ది చదువుకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుత ఏడాదైనా సీటు అవకాశం లభించకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
ఇంకెన్నాళ్లు?
2015–16కు సంబంధించి కడప నగర శివార్లలోని ఫాతిమా మెడికల్ కళాశాలలో సీట్లు పొందినా...చదువు ఆగిపోయింది. కారణం ఎంసీఐ అనుమతి లేకపోవడమే. ఒకవైపు తల్లిదండ్రులు,మరోవైపు విద్యార్థులు రెండేళ్లుగా నిత్యం నేతలు, అధికారులు, సీఎం,మంత్రులను కలుస్తూ వస్తున్నా ఇప్పటికీ కూడా వారి వ్యవహారం కొలిక్కి రాకపోవడం గమనార్హం. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబందించి కూడా ఎంబీబీఎస్ సీట్లకు రెండోవిడత కౌన్సెలింగ్ ఒకట్రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే మెదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. నీట్ ఎంట్రెన్స్ టెస్టలో కూడా కొంతమంది అర్హత సాధించారు.వారిలో కూడా ఎ,బి, కేటగిరీలలో అర్హత సాధించిన వారు తక్కువ కావడంతో..ఇక అంతా మిగతా క్యాటగిరీలో సీటు ఇవ్వాల్సి ఉంది.అయితే సీఎం బాబు ఈ విద్యా సంవత్సరంలో అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చినా.. ఇప్పటికీ రూపుదాల్చ లేదు. కనీసం వారికి ఇప్పిస్తామన్న ఫీజులు విషయంలోనూ క్లారిటీ లేదు.
కనీసం ఫాతిమాలో కట్టిన ఫీజులైనా తిరిగి ఇప్పించగలిగితే ప్రయోజన కరంగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.ఇప్పటికే కొంతమంది విద్యార్దులు చదువుకోసం బంగ్లాదేశ్ వెళ్లగా..మరికొంతమందికి నీట్ నేపథ్యంలో సీట్లు రానున్నాయి. నీట్‌తో దాదాపు 65 మందికి పైగా నష్టపోయిన విద్యార్థులు ప్రస్తుతం క్వాలిఫై అయినా అందరికీ సీట్లు రావడం గగనమే. సర్దుబాటు చేస్తామన్న సీఎంతోపాటు ఇతర నేతలు ఇంకా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. పైగా ఈసారి ఉన్న సమయం కాస్త అయిపోతే మళ్లీ విద్యా సంవత్సరం వృథా కాక తప్పదు. ఫాతిమా మెడికల్ కళాశాలలో 2015–16 సంవత్సరానికి సంబంధించి సీటు లభించిన విద్యార్థులు నేటికీ నరకయాతన అనుభవిస్తున్నారు. సుమారు 90 మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తుకు సరైన దారి దొరుకుతుందో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment