రుణమాఫీ లోగుట్టు బట్టబయలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అమలు చేసిన రుణమాఫీ పథకంలోని లోగుట్టు బట్టబయలైంది. మంగళవారం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో టీడీపీ నేతలే రుణమాఫీ అమలులోని లోపాలను ఎత్తిచూపారు.
ఎకరం భూమి ఉండి 24 వేల రూపాయల అప్పు ఉన్న రైతుకు నాలుగు వేలు మాత్రమే ఎకౌంట్లో వేశారని టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. 50 వేల లోపు రుణం వారికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశారని సీఎంకు స్పష్టం చేశారు. ద్రాక్షారామం సొసైటీలో చాలామంది రైతులకు అన్యాయం జరిగిందని త్రిమూర్తులు చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో గరిష్టంగా ఒక్కో రైతు కుటుంబానికి 1.5 లక్షల వరకు మాఫీ చేస్తూ తొలివిడతలో 20 శాతం వారి అకౌంట్లో జమ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక 50 వేల లోపు రుణం ఉన్నవారికి ఒకేసారి మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆన్లైన్ ఉంచిన రుణమాఫీ జాబితాలో అనేక లోపాలున్నాయని, చాలామంది రైతులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.