నడి సంద్రంలో భయం భయంగా..
- విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్ వెళుతూ నిలిచిపోయిన నౌక
- స్వల్ప మరమ్మతుల అనంతరం తిరిగి విశాఖకు నౌక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్తున్న ప్రయాణికుల నౌక నడిసంద్రంలో దాదాపు 24 గంటల పాటు నిలిచిపోయింది. ఇందులో 506 మంది ప్రయాణికులు, సుమారు 50 మంది సిబ్బంది ఉన్నారు. ఒకరోజంతా సముద్రం లో నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాం దోళనలకు గురయ్యారు. నౌక నిలిచిన సమాచారంతో జిల్లా అధికారులు నేవీ, కోస్ట్‌గార్డ్‌లను అప్రమత్తమయ్యారు. స్వల్ప మరమ్మతుల అనంతరం తిరిగి విశాఖ తీరానికి రప్పించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేపట్టారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్‌కు వెళ్లేందుకు మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ నుంచి 506 మంది ప్రయాణికులతో ఎంవీ హర్షవర్ధన నౌక బయల్దేరింది.
ఆరు గంటల ప్రయాణం తర్వాత నౌకలోని ఒక జనరేటర్ పాడైంది. కాసేపటికి అనూహ్యంగా మరో జనరేటర్ కూడా పాడవ్వడంతో ఇంజన్లు పనిచేయడం మానేశాయి. దీంతో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులకు నౌకలోని అధికారులు సమాచారం అందించారు. అక్కడ్నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో తీరం నుంచి 20 నాటికల్ మైళ్ల దూరంలో నౌకను నిలిపివేశారు. మంగళవారం రాత్రి నుంచి సాంకేతిక నిపుణులు జనరేటర్లకు మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. బుధవారం రాత్రి వరకు మరమ్మతులు కొనసాగాయి. కాగా, ప్రయాణికుల్లో 150 మంది మహిళలు, 15 మంది పిల్లలున్నట్లు సమాచారం. వీరంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు.