
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదుకోవాలన్న సదుద్దేశంతో వైఎస్ సర్కారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించకుండా ఐదేళ్లుగా విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. మరో నెల రోజుల్లో విద్యా సంవత్సరం ముగియనుండగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు చెల్లించలేదు. దీంతో వీరంతా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వీరిలో ఐదు లక్షల మంది బీసీ విద్యార్థులే ఉన్నారు. గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా కోత విధించడంతోనే పేద విద్యార్థుల చదువుల పట్ల సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బోధపడుతోంది.
హాస్టళ్లలో హాహాకారాలు : ప్రతి నెలా స్కాలర్‌షిప్‌లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో వర్సిటీలు, కాలేజీలు, హైస్కూళ్ల అనుబంధ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. మేనేజ్‌మెంట్ హాస్టళ్లలో సరుకులు ఇచ్చేందుకు కిరాణా దుకాణాల యజమానులు నిరాకరిస్తున్నారు. వర్సిటీ హాస్టళ్ల దుస్థితి కూడా ఇలాగే ఉంది. మెస్ చార్జీలు పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లకు బిల్లులు సకాలంలో ఇవ్వటం లేదు.
అగమ్యగోచరంగా 10.21 లక్షల మంది చదువులు : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు దారుణంగా ఉంది. 2018–19కి 3,99,583 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ మంజూరు కాలేదు. 6,21,453 మందికి సగం ఫీజు కూడా సర్కారు ఇవ్వలేదు. రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ పొందే విద్యార్థుల సంఖ్య 18,12,089 వరకు ఉంది. వీరిలో 3,25,811 మంది బీసీ విద్యార్థులకు పాక్షికంగా ఫీజులు మంజూరు కాగా 1,73,492 మందికి ఇవ్వకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ఐదేళ్లుగా తప్పని అవస్థలు.. : రాష్ట్రంలో స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.3,950.67 కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2,892.72 కోట్లు మాత్రమే కేటాయించింది. గత నాలుగేళ్లుగా టీడీపీ సర్కారు విద్యార్థులకు పెద్ద ఎత్తున బకాయి పడింది. విద్యార్థులకు బాకీ పడిన మొత్తం 2018–19 సంవత్సరంలో రూ.1,664.94 కోట్లుగా ఉంది. ఇందులో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1,195.10 కోట్లు బకాయి కాగా స్కాలర్‌షిప్‌ల కింద రూ.469.84 కోట్లు బకాయి ఉంది. ఈ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో విద్యార్థుల చదువులు దినదినగండగా మారాయి. 2017–18లో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ.1,024.16 కోట్లు ఇంతవరకు అందకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తుండటంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజుల పథకానికి ఎగనామం పెడుతూనే ఉంది. 2014–15లో రూ.6.53 కోట్లు, 2015–16లో రూ.8.08 కోట్లు, 2016–17లో రూ.27.81 కోట్లు కాలేజీలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఐదేళ్ల నుంచి ఒక్క సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో ఫీజుల పథకం అమలు కాలేదు.
డిగ్రీ పూర్తి చేసి పీజీలో చేరినా... : ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయం) స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ యూనిట్‌లో సందేహాల నివృత్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ శాఖల నుంచి ఒక్కో ఉద్యోగి ఉంటారు. రోజూ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని పీఎంయూ వద్దకు సుమారు వంద మంది విద్యార్థులు వస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని, ఆన్‌లైన్‌లో లోపాలు కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. గత సంవత్సరమే డిగ్రీ పూర్తి చేసి ఈ ఏడాది పీజీలో చేరిన వారికి కూడా స్కాలర్‌షిప్‌లు రావడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ సర్కారు తమను ఇబ్బందులకు గురి చేస్తోందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment