సాక్షి, నెల్లూరు: కంచే చేను మేస్తోంది..అనే చందాన తయారైంది రోడ్లు, భవనాల శాఖలోని క్వాలిటీ కంట్రోల్ విభాగంలోని కొందరు అధికారుల పనితీరు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పర్యవేక్షించాల్సినవారే అడ్డదారులు తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడుతున్నారు. పనులు నాసిరకంగా జరిగినా, పర్సంటేజీలు పుచ్చుకుని అంతా బాగుందంటూ..నివేదికలు ఇచ్చి నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరవుతాయి. ఈ క్రమంలో ఆ విభాగంలోని కొందరు అధికారులు రోడ్డును పరిశీలించి నివేదిక ఇస్తే ఓ రేటు, పరిశీలించకుండా ఇస్తే మరో రేటు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
రూ.600 కోట్లతో రోడ్ల నిర్మాణం
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సుమారు రూ.600 కోట్లను విడుడల చేశారు. నిధుల మంజూరులో ఆత్మకూరు, నెల్లూరు నగరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు అన్ని పనులను తమ అనుచరులకే వచ్చేలా అధికార పార్టీ నేతలు జాగ్రత్త పడ్డారు. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీలోని పలువురు చోటా నేతలు బినామీ పేర్లతో కాంట్రాక్టు పొంది రెండు చేతుల్లా ఆర్జిస్తున్నారు. కనిపడని రోడ్డు మీదల్లా బూడిద చల్లి, తారు, సిమెంట్ పోస్తున్నారు. కొన్ని చోట్ల బాగున్న రోడ్లమీదే రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్లన్నింటిలో నాణ్యత బాగుందంటూ ఆర్‌అండ్‌బీలోని క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు సర్టిఫై చేస్తున్నారు.
అధికారుల మధ్య
విభేదాలే అవకాశంగా..
రోడ్లు, భవనాల శాఖలోని అధికారుల మధ్య నెలకొన్న విభేదాలను కాంట్రాక్టర్లు అవకాశంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల అండతో సుధీర్ఘకాలంగా ఒకేచోట తిష్టవేసిన కొందరు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు అసలు రోడ్లవైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరు అధికారులు సహచరులతో వాదుపెట్టుకుని నాణ్యతను పర్యవేక్షించే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇదే అదునుగా కాం ట్రాక్టర్లు అంచనాల్లోని నిబంధనలను పాతరేసి సమీపంలో లభించే నాసిరకం బూడిద, చిప్స్‌వేసి తూతూ మంత్రంగా పనులు కానించేస్తున్నారు. చివరలో పర్సెంటేజీలు సమర్పించి బిల్లులు చేయించుకుంటున్నారని సమాచారం.
పట్టించుకోని ‘క్వాలిటీ కంట్రోల్’
రోడ్ల నిర్మాణాల్లో నాణ్యతను పరిశీలించాల్సిన పూర్తి బాధ్యత క్వాలిటీ కంట్రోల్ విభాగానిదే. రూ.50 లక్షల లోపు పనులను డీఈఈ, కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఈఈ, రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఎస్‌ఈ, ఆ పైన సీఈలు పరిశీలించి నాణ్యతను సర్టిఫై చేయాలి. నెల్లూరు పరిధిలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఒక డీఈ, నలుగురు జేఈఈలు, కడప కేంద్రంగా ఎస్‌ఈ (రాయలసీమ,నెల్లూరు జిల్లాలు) ఉంటారు. ఆయా అధికారులు తమ పరిధిలో అన్ని పనులను ఆయన పరిశీలించకుండానే క్వాలిటీ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్లు అడిగినంత సమర్పిస్తున్నారని ఆ శాఖలోనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్ల నిర్మాణం నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆ రోడ్లు ముణ్ణాళ్ల ముచ్చటగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు.
రోడ్లను పరిశీలిస్తున్నాం
ఆత్మకూరు, నెల్లూరులో జరుగుతున్న రోడ్డు నిర్మాణాలను ఇటీవల పరిశీలించాం. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. నిబంధనల మేరకు మెటీరియల్ తీసి ల్యాబ్‌కు పంపాం. రిపోర్ట్లు రావాల్సి ఉంది. నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు. కిందిస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.
-వివేకానందరెడ్డి, ఎస్‌ఈ, క్వాలిటీ కంట్రోల్, ఆర్‌అండ్‌బీ
నాణ్యత గాలికి
Published Wed, Nov 20 2013 3:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement