కర్నూలు (అర్బన్) : రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు మహిళా సంఘాల ద్వారా ఎరువులను పంపిణీ చేయనున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పి. విజయకుమార్ చెప్పారు. మంగళవారం ఆయన కర్నూలులో స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఒడిశాలో భారీ వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జలాశయాలు కళకళలాడుతున్నాయన్నారు. కోస్తాంధ్ర, గోదావరి బెల్ట్‌లో కూడా పంటలు బాగానే ఉన్నాయని చెప్పారు.
నెల్లూరు, ప్రకాశంతోపాటు రాయలసీమ నాలుగు జిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉందని, 43 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గాను 13 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనం వేశారని తెలిపారు. ఆగష్టు 15వ తేదీ వరకు ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోతే రైతాంగం ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాల్సి ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని తంగడంచె భూముల్లో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు కానుందన్నారు. కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు.
మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ
Published Tue, Aug 4 2015 5:37 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement