బాడంగి, న్యూస్‌లైన్: రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా నిల్వ చేసి అడ్డంగా దొరికిపోయాడో డీలరు. విశాఖకు చెందిన విజిలెన్స్ ఎస్‌పీ బ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో సీఐ రేవతమ్మ, ఎస్సై ఎల్. అప్పల నాయుడు, డీసీఓ ఆర్.రఘురాం దాడులు నిర్వహించగా రూ.20.32లక్షల విలువైన ఎరువులు పట్టుబడ్డాయి. బాడంగి మండలం వాడాడలోని వాసవి ఎరువుల షాపుపై విజిలెన్స్ అధికారులు గురువారం దాడులు జరిపారు. ఈ దాడులలో షాపుయజమాని గ్రంథినాగరాజు 30టన్నుల ఎరువులను అక్రమంగా దాచినట్లు గుర్తించారు. రికార్డుల్లో వివరాలు నమోదు చేయకుండా వాటిని బ్లాక్‌చేసినట్టు తెలుసుకుని షాపు యజమాని నాగరాజుపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ విలేకరులకు వివరాలు తెలియజేశారు.
సీజ్‌చేసిన ఎరువులను బాడంగి వ్యవసాయాధికారి బి.గోవిందరావుకు అప్పగించామన్నారు. అక్రమ నిల్వలలో యూరి యా, పొటాష్,డీఏపీ,పాస్ఫేట్ వంటి కాంప్లెక్సు ఎరువులు ఉన్నట్టు తెలిపారు. ఆ వ్యాపారి రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలకు అమ్ముతున్నట్లు పలువురు రైతులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వ్యవసాయాధికారి మాట్లాడుతూ విషయాన్ని జేసీకి నివేదిస్తానని, తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎరువుల షాపుపై దాడులు
Published Fri, Jun 6 2014 2:29 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement
Advertisement