అరకొర సరకులతో.. పండగ చేసుకోండి
చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీపై అనుమానాలు
పది శాతం మందికీ సరిపడని సరకులు
12లోగా పంపిణీ కష్టమేనంటున్న అధికారులు
విశాఖపట్నం: చంద్రన్న సంక్రాంతి కానుక సవాలుగా మారిం ది. సంక్రాంతి పండుగ చేసుకోండంటూ సర్కారు చేసిన ఉచిత సరకుల ప్రకటన ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోంది. పామాయిల్(అరలీటర్), కందిపప్పు (అరకేజీ), శనగలు(కేజీ), గోధుమపిండి (కేజీ), బెల్లం (అరకేజీ), నెయ్యి (100 గ్రాములు) కలిపి ఒక కిట్ రూపంలో ప్రతీ తెల్లకార్డుహోల్డర్లకు అందజేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. ఈ నెల 12వ తేదీలోగా వీటిని ఉచితంగా అందించాలని ఆదేశించింది. జిల్లాలో 10,79,576 కార్డులున్నాయి. ప్యాకెట్ల రూపంలో ఇచ్చే ప్రతీ సరుకూ కార్డుల సంఖ్యకనుగుణంగానే జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు చేరిన పామాయిల్,గోధుములు, శనగలు, కందిపప్పు 10 శాతం మందికి కూడా సరిపోయే పరిస్థితి లేదు.
నెయ్యి, బెల్లం జాడే లేదు. కార్డుల సంఖ్యను బట్టి 10.79లక్షల పామాయిల్ ప్యాకెట్లు(అరకిలో చొప్పున), 1122 మెట్రిక్ టన్నుల శనగలు, గోధుమలు, 561 మెట్రిక్ టన్నుల బెల్లం, కందిపప్పు, 112.205 కేజీల నెయ్యి కేటాయించాల్సి ఉంది. పామాయిల్ 2.80 లక్షల ప్యాకెట్లే వచ్చాయి. 1.83లక్షల గోధుమ పిండి ప్యాకెట్లు , 2.16 లక్షల శనగల ప్యాకెట్లు, అరకిలో చొప్పున పంపిణీ చేయాల్సిన కందిపప్పు 1.28 లక్షల ప్యాకెట్లే చేరుకున్నాయి. బెల్లం 80వేల ప్యాకెట్లు వచ్చినట్లు సమాచారం..కార్డులకూ వచ్చిన సరకుతో పోలిస్తే ఏమాత్రం సరిపోవు.
కష్టమేనంటున్న డీలర్లు
షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టాల్సి ఉంది.కేటాయింపులు ఇలా చేస్తే తామెలా సరఫరా చేయగలమని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. తామేదో స్వాహా చేసిన భావన కార్డుహోల్డర్లకు కలుగుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు.
దాడికి దిగే అవకాశాలున్నాయని భీతిల్లుతున్నామన్నారు. వీటి పంపిణీ బాధ్యత.. పర్యవేక్షణలను జన్మభూమి కమిటీలకు అప్పగించడం వివదాస్పదమవుతుంది. ఇప్పటికే పింఛన్ల తనిఖీలు, రుణమాఫీ జాబితాల్లో ఈ కమిటీల మితిమీరిన జోక్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో మళ్లీ వీరికే సంక్రాంతి కానుక బాధ్యత అప్పగించడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. కాగా యూఐడీ సీడింగ్ కానీ సభ్యులతో పాటు ఆధార్, కుటుంబ వివరాలు, ఫ్యామిలీ ఫొటో అప్‌లోడ్ కాని రచ్చబండ కూపన్‌దారులు సంక్రాంతి కానుకకు దూరమవుతున్నారు.