
సంబరం..అంతలోనే విషాదం
: అయ్యో.. పాపం.. విధి ఎంత నాటకం ఆడింది. ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి అంతలోనే తీరని విషాదాన్ని నింపింది.
సంబరం..అంతలోనే విషాదం
కుల్కచర్ల : అయ్యో.. పాపం.. విధి ఎంత నాటకం ఆడింది. ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి అంతలోనే తీరని విషాదాన్ని నింపింది. కూతురు బర్త్‌డే రోజే కుమారుడు పుట్టడంతో ఉన్నంతలో వారు వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అంతలోనే తండ్రి ప్రమాదవశాత్తు బావిలో మునిగి కానరాని లోకాలకు తరలివెళ్లాడు. అందరి హృదయాలను ద్రవింపజేసే ఈ విషాదకర ఘటన ఆదివారం మండల పరిధిలోని పీరంపల్లిలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పీరంపల్లి గ్రామానికి చెందిన బైరం శ్రీనివాస్(30) వ్యవసాయ కూలీ. ఈయన దోమ మండలం దోర్నాల్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతులకు కూతురు స్వాతి(2) ఉంది. లక్ష్మి నిండు గర్భిణి. శనివారం స్వాతి పుట్టిన రోజు కావడంతో ఉన్నంతలో కుటుంబం వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
లక్ష్మి శనివారం మధ్యాహ్నం కుల్కచర్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దంపతులతో పాటు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఆస్పత్రిలో భార్యాకొడుకు క్షేమంగా ఉండడంతో శ్రీనివాస్ కుటుంబీకులను అక్కడ ఉంచి గ్రామానికి వెళ్లిపోయాడు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సత్యనారాయణయాదవ్ బావిలోని మోటార్ మునిగిపోయింది. ఆయన మోటారును బయటకు తీసే పనిని శ్రీనివాస్‌తో పాటు అదే గ్రామానికి చెందిన మొగులయ్యకు అప్పగించాడు. దీంతో శనివారం సాయంత్రం ఇద్దరూ బావిలో దిగారు. రెండుమూడు సార్లు బావిలో మునిగినా మోటార్ కనిపించలేదు. అనంతరం మళ్లీ నీటిలో మునిగారు. మొగులయ్య బయటకు రాగా శ్రీనివాస్ ఎంతకూ రాలేదు. అతడి ఆచూకీ కోసం బావిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం మ ధ్యాహ్నం బావిలో ఆయన మృతదేహం తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించి వివరాలు సేకరించారు. మృతు డి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు.
కన్నీటిపర్యంతం
శ్రీనివాస్ మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆస్పత్రిలో ఉన్న లక్ష్మి గుండెలుబాదుకుంది.
ఆయ్యో.. నా బిడ్డలు తండ్రిలేని వారయ్యారని రోదించింది. కూతురి పుట్టినరోజు నాడే కుమారుడు పుట్టడంతో శ్రీనివాస్, లక్ష్మి దంపతులు ఎంతో సంతోషపడ్డారని స్థానికులు తెలిపారు. అంతలోనే ఆ విధి ఓర్వలేక శ్రీనివాస్‌ను తీసుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతితో పీరంపల్లిలో విషాదం అలుముకుంది.