ప్రైవేటు డాక్టర్ వద్ద చికిత్స పొందుతున్న దృశ్యం
సాక్షి, గార: మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడం, ఎండలు మండిపోతుండడంతో ఉపాధి వేతనదారులు, చిన్నారులు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు. అయితే అంతా ఎన్నికల బిజీలో ఉండడంతో వీరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మండలంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మండలంలో శ్రీకూర్మం పంచాయతీలో సెగిడిపేట తదితర గ్రామాలతో పాటు, సైరిగాం పంచాయతీ అప్పోజీపేట, రామచంద్రాపురం, గొంటి పంచాయతీల పరిధిలో అధికంగా జ్వర బాధితులు ఉన్నారు.
ఏడు రోజులుగా బాధపడుతున్నా..
ఏడు రోజులుగా జ్వరం వస్తోంది. గ్రామంలోని డాక్టరును అడిగితే మందులు ఇచ్చారు. కానీ తగ్గలేదు. మండలంలో పెద్ద డాక్టరు దగ్గరుకు వెళ్లినా ఏమాత్రం మార్పులేదు. మందులు వాడుతున్నా జ్వరం తగ్గడం లేదు.
– బరాటం వెంకటేశ్వరరావు, అప్పోజీపేట
మరో ఊరెళ్తున్నాం..
ఊర్లో జ్వరం ఉందని చెబితే మందులిచ్చారు. తగ్గలేదు సరికదా ఒళ్లంతా (శరీరమంతా) ఊపేస్తుంది. ఇంకో ఊరెళ్లి వైద్యం చేయించుకుంటున్నాం. అయినా జ్వరం తగ్గడం లేదు. తిండి తినడం లేదు.
– కిల్లాన అచ్చెమ్మ, సెగిడిపేట, శ్రీకూర్మం
Comments
Please login to add a commentAdd a comment