చేరికలోనూ.. చెరోవైపు | fight for join | Sakshi
Sakshi News home page

చేరికలోనూ.. చెరోవైపు

Published Wed, Dec 24 2014 12:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

చేరికలోనూ..  చెరోవైపు - Sakshi

చేరికలోనూ.. చెరోవైపు

ఆధిపత్యం కోసం మంత్రుల అమీతుమీ
కొణతాల కోసం అయ్యన్న ఆరాటం
దాడి కోసం గంటా పోరాటం
టీడీపీలో మండుతున్న విభేదాల కుంపటి

 
విశాఖపట్నం కాదేదీ ఆధిపత్యపోరుకు అనర్హం అన్నరీతిలో టీడీపీలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి చోటామోటా నేతల వరకు ఇరువర్గాలుగా చీలిపోయారు. అంతటితో సరిపోలేదనుకున్నారేమో మంత్రులు ఇద్దరూ ప్రస్తుతం ఏ పార్టీలో లేని నేతలకు కూడా గాలం వేస్తూ తమ వర్గబలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. గంటా వర్గం ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు అయ్యన్న కొణతాలకు స్వాగతహస్తం చాస్తుండగా... అయ్యన్నకు పక్కలో బల్లెంలా తయారు చేసేందుకు దాడి పార్టీలో చేరికకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఒకరి ఎత్తును చిత్తు చేసేందుకు మరొకరు తమ అనుచరవర్గంతో  వీధి పోరాటాలు చేయిస్తున్నారు.
 
గంటా ఆధిపత్యంపై కొణతాల అస్త్రం..  - అయ్యన్న ఎత్తుగడ

పదేళ్ల తరువాత  పార్టీ అధికారం చేపట్టినప్పటికీ జీవీఎంసీ పరిధిలో పట్టులేకపోవడం అయ్యన్నకు అసంతృప్తిగా ఉంది. జీవీఎంసీ పరిధిలోని ఎంపీ అవంతితోపాటు ఎక్కువమంది ఎమ్మెల్యేలు గంటా వర్గంగా కొనసాగుతుండటం ఆయనకు కంటగింపుగా మారింది. ప్రధానంగా   పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ అవంతి పూర్తిగా గంటాకు వర్గీయులుగా ఉన్నారు. ఇటీవల ఆర్డీవోల బదిలీ వ్యవహారంతోసహా పలు కీలక విషయాల్లో అయ్యన్నను తీవ్రంగా వ్యతిరేకించి ఢీ అంటే ఢీ అన్నారు. దాంతో  కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకురావడం ద్వారా జీవీఎంసీ పరిధిలో గంటా ఆధిపత్యానికి గండికొట్టాలని భావించారు. ఈమేరకు కొన్ని రోజులుగా తెరవెనుక మంతనాలు ముమ్మరం చేశారు. కొణతాలను ఒప్పించేందుకు ఆయన ప్రధాన అనుచరుడు గండిబాబ్జీ ద్వారా పావులు  కదిపారు. బాబ్జీకి అవసరమైన పనులు చేస్తామని ఎర వేయడం ద్వారా కొణతాలను పార్టీలోకి రప్పించాలన్నది అయ్యన్న వ్యూహంగా ఉంది.
 
అయ్యన్నపై  ‘దాడి’  - గంటా ప్రతివ్యూహం

మరోవైపు రూరల్ జిల్లాపై అయ్యన్న ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు మంత్రి గంటా చకాచకా పావులు కదుపుతున్నారు. అందుకే కొన్ని రోజులుగా దాడి వీరభద్రరావుతో మంతనాలు సాగిస్తున్నారు.  ఎందుకంటే  గతంలో టీడీపీలో 25ఏళ్లు  అయ్యన్న వ్యతిరేకవర్గానికి నేతృత్వం వహించిన చరిత్ర దాడికి ఉంది. గతంలో ఎన్టీరామారావు మంత్రివర్గంలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరూ ఉప్పూనిప్పులా ఉండేవారన్నది బహిరంగ రహస్యమే. అందుకే మరోసారి అయ్యన్న ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ‘దాడి’ని ప్రయోగించాలని గంటా భావిస్తున్నారు. దాడి ఇటీవల పలుసార్లు మంత్రి గంటాతో సమావేశం కావడం టీడీపీలో చర్చనీయాంశమైంది. దాడికి మార్గం సుగమం చేస్తే కొణతాల పార్టీలోకి వచ్చే ఆలోచనను విరమించుకుంటారన్నది గంటా వర్గం వ్యూహంగా ఉంది.
 
సై అంటే సై
 
కొణతాల, దాడి చేరికల అంశంలో తమ పంతం నెగ్గించుకునేందుకు గంటా, అయ్యన్న వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కొణతాల చేరికకు లైన్ క్లియర్ అవుతోందన్న సమాచారం లీక్ కావడంతో గంటా వర్గం తీవ్రంగా స్పందించింది. అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో గంటా వర్గీయులు కొణతాల దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా తమ ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. కొణతాలను చేర్చుకోవాలని నిర్ణయిస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చంద్రబాబుకు పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు అయ్యన్న కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి సిద్ధపడుతోంది. దాడి చేరికను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. అందుకోసం విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఈస్టు ఎమ్మెల్యే వెలగపూడిలతోసహా అయ్యన్న హైదరాబాద్‌లోనే అమీతుమీ తేల్చుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు మరోసారి బజారున పడుతోంది. మునుముందు పరిణామలు ఎలా ఉంటాయోనని టీడీపీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement