Ramakrishna konatala
-
టీఢీపీ
కొణతాల, గండి బాబ్జీల చేరికపై తార స్థాయిలో విభేదాలు భగ్గుమంటున్న తమ్ముళ్లుట పెందుర్తి, అనకాపల్లిల్లో చీలిక దిశగా రాజకీయాలు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారవుతోంది జిల్లా టీడీపీ పరిస్థితి. పార్టీని బలోపేతం చేసేందుకని చెప్పి కొణాతాల రామకృష్ణ, గండి బాబ్జీలను పార్టీలో చేర్చుకోవాలన్న నిర్ణయం బెడిసికొడుతోంది. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నుంచి సామాన్య కార్యకర్తవరకు బహిరంగంగానే తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. అనకాపల్లిలో అగ్రనేతలు పైకి సర్దుకున్నట్లు కనిపిస్తున్నా ద్వితీయశ్రేణి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల్లో భగ్గుమంటున్న టీడీపీ వర్గపోరు చీలిక దిశగా అడుగులు వేస్తోంది. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం కొణతాల, బాబ్జిల చేరిక వ్యవహారం టీడీపీలో చిచ్చురేపుతోంది. గండి బాబ్జీ టీడీపీలో చేరుతారన్న సమాచారం పెందుర్తి టీడీపీ రాజకీయాలను అతలాకుతలం చేస్తోంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని సీఎం చంద్రబాబు పిలిపించి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ బండారు మెత్తబడలేదని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. ఓ స్థాయికి మించి చంద్రబాబు వద్ద వాదించడం ఇష్టం లేక క్షేత్రస్థాయిలో తన తడాఖా చూపించాలని ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాని తెలిసింది. ఆయన నుంచి స్పష్టమైన సంకేతాలతో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో బహిరంగంగానే గండి బాబ్జీపై విరుచుకుపడుతున్నారు. మండలాలవారీగా సమీకరణలను అంచనా వేస్తూ గండి బాబ్జీకి పూర్తిగా చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే బండారు సొంత మండలం పరవాడలో బాబ్జీని అడుగుపెట్టనిచ్చేది లేదని నేతలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. పెందుర్తి మండలంలో టీడీపీ నేతలు బాబ్జీపై ఇప్పటికే విమర్శలతో విరుచుకుపడ్డారు. వాటికి ప్రతివిమర్శ చేయడంగాని, తనను తాను సమర్థించుకోవడం కూడా గండి బాబ్జీ చేయలేకపోయారు. తన సొంత మండలం సబ్బవరంలో ఉన్న కొద్దిమంది బాబ్జీ అనుచరులకు కూడా ఎలాంటి ప్రయోజనం కలిగించే అవకాశం ఇవ్వకూడదని ఎమ్మెల్యే బండారు నిర్ణయించారు. అందుకే జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా ఆయనపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాలన్నీ జన్మభూమి కమిటీల ద్వారానే పంపిణీ చేయనున్నారు. ఆ కమిటీ సభ్యులే బాబ్జీని దుయ్యబడుతున్నారంటే ఇక ఆయన కార్యకర్తలకు ఏమీ దక్కదని స్పష్టమవుతోంది. ఇంత వ్యూహరచన చేస్తున్నా కొందరు టీడీపీ కార్యకర్తలు ఇంకా శాంతించడం లేదు. తమను గతంలో వేధించిన బాబ్జీ పార్టీలోకి వస్తే తాము రాజీనామా చేస్తామని పలువురు ద్వితీయశ్రేణి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే బండారు హైదరాబాద్‌నుంచి రాగానే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. అనకాపల్లిలో తిరుగుబాటు బావుటా కొణతాల, ఎమ్మెల్యే పీలాకు ఎదురుగాలి పైకి గుంభనంగా కనిపిస్తున్నా అనకాపల్లి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి కుంపటి లోలోన రాజుకుంటోంది. వివాహ బంధుత్వ కారణాలతో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కొణతాల విషయంలో మౌనంగా ఉన్నారు. కానీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కొణతాల రాకను ఏమాత్రం సమ్మతించడం లేదు. పెందుర్తి నియోజకవర్గానికి చెందినప్పటికీ కేవలం పార్టీపై అభిమానంతోనే పీలాను గెలిపించామని వారు చెబుతున్నారు. వెంట ఒక్క కార్యకర్త కూడా లేకుండా అనకాపల్లి వచ్చిన ఎమ్మెల్యే పీలా ఈ రోజు బంధుత్వం పేరుతో కొణతాల రాకను సమ్మతిస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. గతంలో కొణతాల వల్ల తాము ఎంతగా ఇబ్బందులు పడిందీ ఏకరవు పెడుతున్నారు. ఆ సమయంలో నియోజవకర్గంలో లేని ఎమ్మెల్యే పీలాకు తమ బాధలు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. కొణతాల, ఎమ్మెల్యే పీలా రాజీపడవచ్చేమోగానీ గతంలో ఎదుర్కొన్న వేధింపులను తాము మరచిపోలేమని చెబుతున్నారు. అదే జరిగితే పార్టీని వీడేందుకు కూడా తాము సిద్ధమేనని వీధుల్లోకి వచ్చి మరీ హెచ్చరిస్తున్నారు. పెందుర్తి, అనకాపల్లిలలో టీడీపీ పుట్టి ముంచేలా తయారవుతున్నాయని స్పష్టమవుతోంది. -
ఇక తాడో పేడో..!
పరాకాష్టకు చేరిన అయ్యన్న-గంటా విభేదాలు కొణతాల, గండి చేరికకు చంద్రబాబు ఓకే పట్టుబట్టి సాధించిన మంత్రి అయ్యన్న తాజా పరిణామాలతో రగిలిపోతున్న గంటా వర్గం భగ్గుమంటున్న బండారు, పీలా అనూహ్య పరిణామాల దిశగా జిల్లా టీడీపీ రాజకీయాలు విశాఖపట్నం జిల్లా టీడీపీ విభేదాల కథ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మంత్రి గంటా వర్గం అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీల చేరికకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. సంక్రాంతి తరువాత ముహూర్తమని మంత్రి అయ్యన్న ప్రకటించేశారు. దీనిపై కనీస సమాచారం కూడా ఇవ్వకుండా గంటా వర్గానికి సీఎం చంద్రబాబు తేరుకోలేని దెబ్బకొట్టారు. తాజా పరిణామాలపై గంటా వర్గం రగిలిపోతోంది. భగ్గుమన్న ఎమ్మెల్యే బండారు ఫోన్ స్విచ్ఛాప్ చేసేసి భవిష్యత్ నిర్ణయంపై సంకేతాలు ఇచ్చారు. సందిగ్ధంలో పడిన ఎమ్మెల్యే పీలా తీవ్ర నిర్ణయం దిశగా సమాచాలోచనలు జరుపుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి గంటావర్గం సమాయత్తమవుతోంది. గంటాకు అయ్యన్న షాక్ జిల్లా టీడీపీపై ఆధిపత్య పోరులో మంత్రి అయ్యన్నపాత్రుడు పైచేయి సాధించారు. టీడీపీలో కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీల చేరికకు మార్గం సుగమం చేశారు. వారిద్దరు మంగళవారం చంద్రబాబుతో భేటీ కావడంతో గంటా వర్గం షాక్‌కు గురైంది. అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్‌లోనే ఉన్న గంటాతోపాటు పెందుర్తి, అనకాపల్లి, గాజువాక, చోడవరం, యలమంచిలి ఎమ్మెల్యేలకు దీనిపై కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. సంక్రాంతి తరువాత కొణతాల, గండి బాబ్జీలు టీడీపీలో చేరుతారని చంద్రబాబుతో భేటీ అనంతరం మంత్రి అయ్యన్న ప్రకటించేశారు. గంటా వర్గాన్ని దెబ్బతీసేందుకే కొణతాల, గండి బాబ్జీలను అయ్యన్న పట్టుబట్టి టీడీపీలోకి తీసుకువస్తున్నారన్నది స్పష్టమైంది. వారిద్దరూ టీడీపీలో చేరతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయ్యన్న ఏకంగా పెందుర్తిలో గండి బాబ్జీతో కలసి పర్యటించారు. ఈ ప్రయత్నాలను గంటా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలకు వేర్వేరు బ్యాలెట్లతో పోలింగ్ నిర్వహిస్తారని స్పష్టం కావడంతో కొణతాల, గండి బాబ్జీల చేరిక ప్రతిపాదన అప్పట్లో నిలిచిపోయింది. అయ్యన్న మాత్రం తన ప్రయత్నాలను చాపకింద నీరులా కొనసాగించి అనుకున్నది సాధించారు. గంటా వర్గం గరం గరం కొణతాల, గండి బాబ్జీల చేరికకు చంద్రబాబు పచ్చజెండా ఊపడాన్ని గంటా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మంత్రి గంటా తన వర్గీయులతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా మాట్లాడారు. కొణతాల, గండి బాబ్జీల చేరికను అడ్డుకోవడానికి ఎంతవరకైనా వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఈ పరిణామాలపై రగిలిపోతున్నారు. విషయం తెలిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన అర్ధాంతరంగా నిష్ర్కమించారు. నియోజకవర్గంలోని ఒకరిద్దరు ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లడిన అనంతరం ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయారు. ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బాబ్జీ చేరికను వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పించడం ద్వారా పెందుర్తి టీడీపీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సంకేతాలు ఇచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కూడా కొణతాల చేరికకు సమ్మతించేది లేదని తేల్చి చెప్పారు. సమష్టిగా నిర్ణయం తీసుకుందామా... లేక తమ దారి తాము చూసుకోవాలా అని ఎమ్మెల్యేలు బండారు, పీలా మంత్రి గంటాను నిలదీసినట్లు సమాచారం. తమ అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేసి ఫలితం లేకపోతే భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని గంటా వర్గం భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ విభేదాలు తాడోపేడో తేలిపోనుండటం ఖాయమని స్పష్టమవుతోంది. -
చేరికలోనూ.. చెరోవైపు
⇒ ఆధిపత్యం కోసం మంత్రుల అమీతుమీ ⇒ కొణతాల కోసం అయ్యన్న ఆరాటం ⇒ దాడి కోసం గంటా పోరాటం ⇒ టీడీపీలో మండుతున్న విభేదాల కుంపటి విశాఖపట్నం కాదేదీ ఆధిపత్యపోరుకు అనర్హం అన్నరీతిలో టీడీపీలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి చోటామోటా నేతల వరకు ఇరువర్గాలుగా చీలిపోయారు. అంతటితో సరిపోలేదనుకున్నారేమో మంత్రులు ఇద్దరూ ప్రస్తుతం ఏ పార్టీలో లేని నేతలకు కూడా గాలం వేస్తూ తమ వర్గబలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. గంటా వర్గం ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు అయ్యన్న కొణతాలకు స్వాగతహస్తం చాస్తుండగా... అయ్యన్నకు పక్కలో బల్లెంలా తయారు చేసేందుకు దాడి పార్టీలో చేరికకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఒకరి ఎత్తును చిత్తు చేసేందుకు మరొకరు తమ అనుచరవర్గంతో వీధి పోరాటాలు చేయిస్తున్నారు. గంటా ఆధిపత్యంపై కొణతాల అస్త్రం.. - అయ్యన్న ఎత్తుగడ పదేళ్ల తరువాత పార్టీ అధికారం చేపట్టినప్పటికీ జీవీఎంసీ పరిధిలో పట్టులేకపోవడం అయ్యన్నకు అసంతృప్తిగా ఉంది. జీవీఎంసీ పరిధిలోని ఎంపీ అవంతితోపాటు ఎక్కువమంది ఎమ్మెల్యేలు గంటా వర్గంగా కొనసాగుతుండటం ఆయనకు కంటగింపుగా మారింది. ప్రధానంగా పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ అవంతి పూర్తిగా గంటాకు వర్గీయులుగా ఉన్నారు. ఇటీవల ఆర్డీవోల బదిలీ వ్యవహారంతోసహా పలు కీలక విషయాల్లో అయ్యన్నను తీవ్రంగా వ్యతిరేకించి ఢీ అంటే ఢీ అన్నారు. దాంతో కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకురావడం ద్వారా జీవీఎంసీ పరిధిలో గంటా ఆధిపత్యానికి గండికొట్టాలని భావించారు. ఈమేరకు కొన్ని రోజులుగా తెరవెనుక మంతనాలు ముమ్మరం చేశారు. కొణతాలను ఒప్పించేందుకు ఆయన ప్రధాన అనుచరుడు గండిబాబ్జీ ద్వారా పావులు కదిపారు. బాబ్జీకి అవసరమైన పనులు చేస్తామని ఎర వేయడం ద్వారా కొణతాలను పార్టీలోకి రప్పించాలన్నది అయ్యన్న వ్యూహంగా ఉంది. అయ్యన్నపై ‘దాడి’ - గంటా ప్రతివ్యూహం మరోవైపు రూరల్ జిల్లాపై అయ్యన్న ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు మంత్రి గంటా చకాచకా పావులు కదుపుతున్నారు. అందుకే కొన్ని రోజులుగా దాడి వీరభద్రరావుతో మంతనాలు సాగిస్తున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీలో 25ఏళ్లు అయ్యన్న వ్యతిరేకవర్గానికి నేతృత్వం వహించిన చరిత్ర దాడికి ఉంది. గతంలో ఎన్టీరామారావు మంత్రివర్గంలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరూ ఉప్పూనిప్పులా ఉండేవారన్నది బహిరంగ రహస్యమే. అందుకే మరోసారి అయ్యన్న ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ‘దాడి’ని ప్రయోగించాలని గంటా భావిస్తున్నారు. దాడి ఇటీవల పలుసార్లు మంత్రి గంటాతో సమావేశం కావడం టీడీపీలో చర్చనీయాంశమైంది. దాడికి మార్గం సుగమం చేస్తే కొణతాల పార్టీలోకి వచ్చే ఆలోచనను విరమించుకుంటారన్నది గంటా వర్గం వ్యూహంగా ఉంది. సై అంటే సై కొణతాల, దాడి చేరికల అంశంలో తమ పంతం నెగ్గించుకునేందుకు గంటా, అయ్యన్న వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కొణతాల చేరికకు లైన్ క్లియర్ అవుతోందన్న సమాచారం లీక్ కావడంతో గంటా వర్గం తీవ్రంగా స్పందించింది. అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో గంటా వర్గీయులు కొణతాల దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా తమ ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. కొణతాలను చేర్చుకోవాలని నిర్ణయిస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చంద్రబాబుకు పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు అయ్యన్న కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి సిద్ధపడుతోంది. దాడి చేరికను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. అందుకోసం విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఈస్టు ఎమ్మెల్యే వెలగపూడిలతోసహా అయ్యన్న హైదరాబాద్‌లోనే అమీతుమీ తేల్చుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు మరోసారి బజారున పడుతోంది. మునుముందు పరిణామలు ఎలా ఉంటాయోనని టీడీపీవర్గాలు చర్చించుకుంటున్నాయి. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు పెద్దపీట
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా రాష్ట్ర స్థాయి కమిటీలను నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నియమించిన ఈ కమిటీల్లో జిల్లాకు పెద్ద పీట దక్కింది. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన రాజకీయ వ్యవహారాల కమిటీలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణకు స్థానం కల్పించారు. పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యురాలిగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని నియమించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కింది. జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ కంపా హనోకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాలతో రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు అత్యధిక ప్రాతినిధ్యం దక్కినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షున్ని నియమించిన పార్టీ అధిష్టానం జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నడుంబిగించింది. అందులో భాగంగానే కమిటీలను ప్రకటించింది. జిల్లా స్థాయి కమిటీలను కూడా త్వరలోనే ఖరారు చేయనుంది.