టీఢీపీ
కొణతాల, గండి బాబ్జీల చేరికపై తార స్థాయిలో విభేదాలు
భగ్గుమంటున్న తమ్ముళ్లుట
పెందుర్తి, అనకాపల్లిల్లో చీలిక దిశగా రాజకీయాలు
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారవుతోంది జిల్లా టీడీపీ పరిస్థితి. పార్టీని బలోపేతం చేసేందుకని చెప్పి కొణాతాల రామకృష్ణ, గండి బాబ్జీలను పార్టీలో చేర్చుకోవాలన్న నిర్ణయం బెడిసికొడుతోంది. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నుంచి సామాన్య కార్యకర్తవరకు బహిరంగంగానే తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. అనకాపల్లిలో అగ్రనేతలు పైకి సర్దుకున్నట్లు కనిపిస్తున్నా ద్వితీయశ్రేణి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల్లో భగ్గుమంటున్న టీడీపీ వర్గపోరు చీలిక దిశగా అడుగులు వేస్తోంది. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
కొణతాల, బాబ్జిల చేరిక వ్యవహారం టీడీపీలో చిచ్చురేపుతోంది. గండి బాబ్జీ టీడీపీలో చేరుతారన్న సమాచారం పెందుర్తి టీడీపీ రాజకీయాలను అతలాకుతలం చేస్తోంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని సీఎం చంద్రబాబు పిలిపించి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ బండారు మెత్తబడలేదని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. ఓ స్థాయికి మించి చంద్రబాబు వద్ద వాదించడం ఇష్టం లేక క్షేత్రస్థాయిలో తన తడాఖా చూపించాలని ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాని తెలిసింది. ఆయన నుంచి స్పష్టమైన సంకేతాలతో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో బహిరంగంగానే గండి బాబ్జీపై విరుచుకుపడుతున్నారు. మండలాలవారీగా సమీకరణలను అంచనా వేస్తూ గండి బాబ్జీకి పూర్తిగా చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే బండారు సొంత మండలం పరవాడలో బాబ్జీని అడుగుపెట్టనిచ్చేది లేదని నేతలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. పెందుర్తి మండలంలో టీడీపీ నేతలు బాబ్జీపై ఇప్పటికే విమర్శలతో విరుచుకుపడ్డారు. వాటికి ప్రతివిమర్శ చేయడంగాని, తనను తాను సమర్థించుకోవడం కూడా గండి బాబ్జీ చేయలేకపోయారు. తన సొంత మండలం సబ్బవరంలో ఉన్న కొద్దిమంది బాబ్జీ అనుచరులకు కూడా ఎలాంటి ప్రయోజనం కలిగించే అవకాశం ఇవ్వకూడదని ఎమ్మెల్యే బండారు నిర్ణయించారు.
అందుకే జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా ఆయనపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాలన్నీ జన్మభూమి కమిటీల ద్వారానే పంపిణీ చేయనున్నారు. ఆ కమిటీ సభ్యులే బాబ్జీని దుయ్యబడుతున్నారంటే ఇక ఆయన కార్యకర్తలకు ఏమీ దక్కదని స్పష్టమవుతోంది. ఇంత వ్యూహరచన చేస్తున్నా కొందరు టీడీపీ కార్యకర్తలు ఇంకా శాంతించడం లేదు. తమను గతంలో వేధించిన బాబ్జీ పార్టీలోకి వస్తే తాము రాజీనామా చేస్తామని పలువురు ద్వితీయశ్రేణి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే బండారు హైదరాబాద్‌నుంచి రాగానే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు.
అనకాపల్లిలో తిరుగుబాటు బావుటా కొణతాల, ఎమ్మెల్యే పీలాకు ఎదురుగాలి
పైకి గుంభనంగా కనిపిస్తున్నా అనకాపల్లి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి కుంపటి లోలోన రాజుకుంటోంది. వివాహ బంధుత్వ కారణాలతో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కొణతాల విషయంలో మౌనంగా ఉన్నారు. కానీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కొణతాల రాకను ఏమాత్రం సమ్మతించడం లేదు. పెందుర్తి నియోజకవర్గానికి చెందినప్పటికీ కేవలం పార్టీపై అభిమానంతోనే పీలాను గెలిపించామని వారు చెబుతున్నారు. వెంట ఒక్క కార్యకర్త కూడా లేకుండా అనకాపల్లి వచ్చిన ఎమ్మెల్యే పీలా ఈ రోజు బంధుత్వం పేరుతో కొణతాల రాకను సమ్మతిస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. గతంలో కొణతాల వల్ల తాము ఎంతగా ఇబ్బందులు పడిందీ ఏకరవు పెడుతున్నారు. ఆ సమయంలో నియోజవకర్గంలో లేని ఎమ్మెల్యే పీలాకు తమ బాధలు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. కొణతాల, ఎమ్మెల్యే పీలా రాజీపడవచ్చేమోగానీ గతంలో ఎదుర్కొన్న వేధింపులను తాము మరచిపోలేమని చెబుతున్నారు. అదే జరిగితే పార్టీని వీడేందుకు కూడా తాము సిద్ధమేనని వీధుల్లోకి వచ్చి మరీ హెచ్చరిస్తున్నారు. పెందుర్తి, అనకాపల్లిలలో టీడీపీ పుట్టి ముంచేలా తయారవుతున్నాయని స్పష్టమవుతోంది.