వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు పెద్దపీట
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా రాష్ట్ర స్థాయి కమిటీలను నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన ఈ కమిటీల్లో జిల్లాకు పెద్ద పీట దక్కింది. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన రాజకీయ వ్యవహారాల కమిటీలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణకు స్థానం కల్పించారు.
పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యురాలిగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని నియమించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కింది. జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ కంపా హనోకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాలతో రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు అత్యధిక ప్రాతినిధ్యం దక్కినట్టు స్పష్టమవుతోంది.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షున్ని నియమించిన పార్టీ అధిష్టానం జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నడుంబిగించింది. అందులో భాగంగానే కమిటీలను ప్రకటించింది. జిల్లా స్థాయి కమిటీలను కూడా త్వరలోనే ఖరారు చేయనుంది.