విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గుంటూరులో బుధవారం నుంచి పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు సంఘీభావంగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8నుంచి అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ దీక్షల్లో పాల్గొనేందుకు మంగళవారం గుంటూరుకు బయల్దేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. హోదా కోరే వారంతా జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతు పలకాలన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో భాగంగా 8న పట్టణ, మండల కేంద్రాలు, నియెజకవర్గ కేంద్రాల్లో దీక్షా శిబిరాలు, 9న నియెజకవర్గం కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు, 10న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, 11న రహదారులపై వంటావార్పు, 12న రహదారుల దిగ్బంధం తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
జనాధారణ చూసి ఓర్వలేకే విమర్శలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను, అభిమానాన్ని చూసి ఓర్వలేకే మంత్రులు, టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, వాటిని నమ్మే పరిస్థితిలో వారు లేరని కోలగట్ల అన్నారు. భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్ట్ బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చిన జగన్ పర్యటనను విజయవంతం చేసిన జిల్లా నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
కోలగట్ల వెంట గుంటూరు వెల్లిన వారిలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, జిల్లా పార్టీ ప్రధా నకార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమళ్ల వెంకటరమణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జి.సూరపరాజు, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి రేగాన.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
హోదా సాధించే వరకూ పోరు
Published Wed, Oct 7 2015 12:37 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
Advertisement