ప్రజల పక్షాన పోరాడుతాం
రావులపాలెం, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రజలకు భరోసా ఇచ్చారు. సోమవారం రావులపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తపేట నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కుడిపూడి చిట్టబ్బాయి, ఇందుకూరి రామకృష్ణంరాజు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి, తదితర నాయకులు హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలతో అన్ని పార్టీ నాయకులను కలుపుకుని పోటీ చేస్తే ఆ గాలిని తట్టుకుని జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక నాయకుడు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అని గుర్తు చేశారు. జగ్గిరెడ్డి విజయం ప్రజా విజయమన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కూటమి నేతలు చేస్తున్న దాడులను ఎదుర్కొనేందుకు గెలిచిన నాయకులతోపాటు స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి చంద్రబాబులా ఆచరణ సాధ్యం కాని రైతు రుణ మాఫీ హామీ ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చేవారమని, కానీ ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పే నైజం తమ నాయకుడిది కాదన్నారు.చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా నిలదీస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో జగ్గిరెడ్డి విజయం పార్టీకి ఆక్సిజన్ వంటిదని పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల సమస్యలపై జగ్గిరెడ్డి పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటారని జిల్లా అధికార ప్రతినిధి మిండగుదిటి మోహన్ పేర్కొన్నారు.
జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇది వైఎస్సార్ సీపీ ప్రతి కార్యకర్త గెలుపు అన్నారు. తనకు ఈ విజయం అందించిన ప్రజల రుణం తీర్చుకోడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు పీకే రావు, గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, ఇండస్ట్రియల్ విభా గం కన్వీనర్ మం తెన రవిరాజు, రావులపాలెం, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యులు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, ముత్యాల వీరభద్రరావు, నాతి అనురాగమయి పాల్గొన్నారు.