సాక్షి ప్రతినిధి, తిరుపతి/చంద్రగిరి : స్మగ్లర్లు చెలరేగి పోతున్నారు. గుంపులు గుంపులుగా అడవిలోకి చొరబడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్నారు. ఇటు తిరుపతి, అటు కడప జిల్లాల టాస్క్‌ఫోర్సు, ఫారెస్టు పోలీసులు విస్తృతంగా వేట కొనసాగిస్తున్నా పెద్ద మొత్తంలో దుంగలు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాత్రిళ్లు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. సాయుధులైన పోలీ సులు నాలుగు బృందాలుగా విడిపోయి శేషాచలం అడవిని తూర్పార పడుతున్నారు. అయినప్పటికీ ఎర్ర దొం గల ఆగడాలు తగ్గడం లేదు. శుక్రవారం రాత్రి ఎర్రగుట్ట అట వీ ప్రాంతంలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. పోలీసులపై తిరగబడ్డారు. దీంతో కానిస్టేబుల్ గోవర్దన్‌కు స్వల్ప గాయమైంది. చీకట్లో స్మగ్లర్లను చుట్టుముట్టిన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో దుంగల్ని కింద పడేసిన స్మగ్లర్లు చెల్లాచెదురై పారిపోయారు.
అసలేం జరిగిందంటే..
గురువారం రాత్రి 7 గంటల సమయం. పదిమందితో ఏర్పాటైన ఆర్‌ఎస్‌ఐ వాసు టాస్క్‌ఫోర్స్ టీమ్ అడవిలో కూంబింగ్ ప్రారంభించింది. శ్రీవారిమెట్టు నుంచి కల్యాణి డ్యాం వైపు సాయుధ బలగాలు చీకట్లో నడిచి వెళ్తున్నాయి. ముందుగా ఎవరో వెళ్లినట్లు పోలీసులు పసిగట్టారు. రాత్రి 11 గంటల సమయానికి వీరంతా సచ్చినోడిబండ దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడే అసలు కథ నడిచింది. పోలీసులు వెనుకే వస్తున్నారని పసిగట్టిన స్మగ్లర్లు విడివిడిగా చీలిపోయారు. తలా ఒక దిక్కునకు నడిచి వెళ్లడం ప్రారంభించారు. దీన్ని గుర్తించిన పోలీసులు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి వేగంగా నడిచి స్మగ్లర్లను గుర్తించారు. అప్పటికే లోడ్ పాయింట్ దగ్గరకు చేరుకుని ఎర్ర దుంగలను వాహనంలోకి లోడ్ చేస్తోన్న స్మగ్లర్లపై ఒక్కసారిగా దాడి చేశారు.
తిరగబడిన స్మగ్లర్లు
హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడ్డ ఎర్ర స్మగ్లర్లు దుంగల్ని కింద పడేసి పరుగు లంకించుకున్నారు. పోలీసులు కీలక స్మగ్లర్లుగా భావించే మురుగన్, తంగరాజన్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి 19 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకునే క్రమంలో తిరగబడ్డ స్మగ్లర్లతో పోలీసులు కాస్తంత ముష్టియుద్దమే చేశారు.
ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ గోవర్దన్ కాలికి గాయమైంది. మురుగన్‌కు కూడా ముఖంపై గాయమైంది. ఆర్‌ఎస్‌ఐ వాసు, డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ పీవీఎన్ రావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జానీబాషా, హెడ్ కానిస్టేబుళ్లు రవి, శ్రీను, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, జయచంద్ర, ముత్యాలు, ధన, విజయ్ ధైర్య సాహసాలను ప్రదర్శించడంతో డీఎస్పీ హరినాథ బాబు వీరిని ప్రత్యేకంగా అభినందించారు.