=రైతుల ముందే కొట్లాట
=ఒకరు పశు సంవర్ధక శాఖ ఏడీ, మరొకరు పశు వైద్యాధికారి
రాంబిల్లి, న్యూస్‌లైన్: ఇద్దరు బాధ్యత గల అధికారులు దూషించుకున్నా రు. ఒకరిపై ఒకరు కల బడ్డారు. అందరూ చూస్తుండగా వాదులాడుకున్నారు. వీరి వైఖరిని చూసిన వారంతా విస్తుపోయారు. ఒకరు పశు సంవర్ధక శాఖ ఏడీ, మరొకరు రాంబిల్లి పశు వైద్యాధికారి కావడం విశేషం. ఈ సంఘటన గురువారం రాంబిల్లి పశువైద్య శాలలో జరిగింది. రైతులు, సిబ్బంది, ఎస్‌ఐ కృష్ణారావు కథనం ప్రకారం ఉదయం 8.15 నిమిషాలకు పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ రాజ్‌కుమార్ రాంబిల్లి పశువైద్యశాలకు తనిఖీ నిమిత్తం వచ్చారు.
డాక్టర్ అనిల్‌కుమార్ 10.10 గంటలకు ఆస్పత్రికి చేరుకొని తన గదిని తెరవడంతో ఏడీ కూడా లోపలికి వెళ్లారు. లోపల గడియ పెట్టడంతో సిబ్బంది, రైతులు గదిలోకి వెళ్లలేదు. కాసేపయ్యాక గదిలో నుంచి పెద్ద ఎత్తున కేకలు వినిపించడంతో అందరూ చేరుకుని తలుపును తెరిచారు. ఆ సమయంలో పశు సంవర్థక శాఖ ఏడీ, పశు వైద్యాధికారి పెనుగులాడుతున్న దృశ్యం కనిపించడంతో అంతా విస్తుపోయారు. రిజిస్టర్‌లో సంతకం చేయకుండా అడ్డుకున్న తనను కొట్టారని ఏడీ ఆరోపించగా, ఏడీ తన చెంపపై కొట్టారని డాక్టర్ అనిల్‌కుమార్ చెప్పారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వి.కృష్ణారావు ఆస్పత్రికి చేరుకొని అధికారులు, రైతులు, సిబ్బందిని విచారించారు.
అనంతరం ఏడీ డాక్టర్ రాజ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ అనిల్‌కుమార్ సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని పలువురు రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. తుపాను ఫీడ్ పంపిణీ చేయలేదని, దాని రికార్డులు లేవన్నారు. మూడు నెలల క్రితం వేయాల్సిన టీకాలు రిఫ్రిజిరేటర్‌లో ఉన్నాయన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ కావాలనే తనను ఏడీ వేధిస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఐ కృష్ణారావు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
పశువుల డాక్టర్ల ఫైటింగ్
Published Fri, Dec 6 2013 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement