ఉమా vs నాని
టీడీపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు
పరిటాలలో తాజాగా బయటపడిన విభేదాలు
పైలాన్ తరలింపు విషయంలో ఇరు వర్గాల ఘర్షణ
విజయవాడ : తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని), రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారితో పాటు ఇరు వర్గాల మధ్య కూడా చిచ్చు రేగుతోంది. ఇటీవల ఉమా తీరుపై బహిరంగంగా విమర్శలు చేసిన కేశినేని నానిని సీఎం పిలిపించి మాట్లాడిన విషయం తెలిసిందే. పార్టీలోని అంతర్గత వ్యవహారాలు బయటపెట్టవద్దని వారించి పంపించినట్లు సమాచారం. అయితే, ఇటీవల ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుపై కూడా ఎంపీ కేశినేని నాని కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అంటే మంత్రి ఉమామహేశ్వరరావు ఒక్కరే కాదని, చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని, వారి గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు. టీడీపీలో ఎంతోకాలం నుంచి ఉంటున్నవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ అందరినీ కలుపుకొని పోవాలని కోరారు.
చాపకింద నీరులా ఉమా తీరు..
మరోపక్క మంత్రి ఉమా వ్యవహారం మాత్రం చాపకింద నీరులా సాగుతోంది. ఎవరెన్ని చెబుతున్నా, సీఎం వద్ద ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా తన పని తాను చేసుకుపోతున్నారు. జిల్లా అధికారులు మంత్రి ఉమా కనుసన్నల్లోనే నడుస్తున్నారు. ఆయన చెప్పిందే వేదంగా భావించి అడుగులు వేస్తున్నారు. దీనిని నానితో పాటు జిల్లాలోని ఇద్దరు మంత్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ నాయకుడు, మంత్రి కామినేని శ్రీనివాసరావు ఇప్పటికే తన శాఖలో జోక్యం చేసుకోవద్దంటూ మంత్రి దేవినేనిని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక కొల్లు రవీంద్ర కూడా ఇదే పద్ధతుల్లో ఉన్నా ఆయనకు అధికారులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ సాగుతోంది.
పేలుడు ఘటనపై నర్మగర్భంగా వ్యాఖ్యలు...
నగరంలోని కేఎల్‌రావు నగర్‌లో జరిగిన పేలుడులో చనిపోయిన, గాయపడిన కుటుంబాల వారికి సాయం అందజేసేందుకు బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ఉమా మాట్లాడుతూ గ్యాస్ లీక్ వల్ల ఘటన జరిగినట్లు నిర్ధారణ కాలేదని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై త్వరలోనే నిజాలు వెల్లడవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఏదో ఉందనేది ఆయన మాటల్లో నర్మగర్భంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేశినేని నాని వద్ద కార్గో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నివసిస్తున్న ఇంట్లోనే పేలుడు సంభవించినందున ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే చర్చ జరుగుతోంది.
తాజాగా పరిటాలలో రెండు వర్గాల ఘర్షణ
బుధవారం కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో మంత్రి దేవినేని ఉమా, ఎంపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు తోపులాటలతో బాహాబాహీకి దిగారు. ఆ తరువాత రెండు వర్గాల వారు మాట్లాడుకొని ఎంపీ వర్గీయులే వెనుదిరగాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్రకు గుర్తుగా పరిటాలలో ఈ పైలాన్‌ను కేశినేని నాని సొంత ఖర్చులతో నిర్మించి ప్రారంభింపజేశారు. ప్రజలను మరింత ఆకర్షించే ప్రాంతంలో పైలాన్ ఏర్పాటుచేసేందుకు చంద్రబాబు వద్ద నాని అనుమతి తీసుకున్నారు. 65వ నంబరు జాతీయ రహదారి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కూడలి వద్ద పైలాన్‌ను ఏర్పాటు చేసేందుకు బుధవారం పాత ప్రదేశంలో ఉన్న పైలాన్‌ను తరలించేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నించారు. దీనిని మంత్రి వర్గీయులు అడ్డుకోగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలోనూ మంత్రిదే పైచేయిగా మారుతోందని ఎంపీ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు.
మంత్రి నారాయణపై వ్యతిరేకత
మరోవైపు టీడీపీ శ్రేణుల్లో మంత్రి నారాయణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్పొరేట్ రంగం నుంచి పార్టీలోకి వచ్చిన నారాయణను ఏకంగా మంత్రిని చేసి కార్యకర్తలకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం రాత్రి ప్రాంతంలో గుడివాడలో చోటుచేసుకున్న పరిణామం మంత్రిని సైతం కలవరపరిచింది. 11 గంటల తరువాత గుడివాడవీధుల్లో మంత్రి తనిఖీలు చేశారు. ఇప్పటికి మూడుసార్లు గుడివాడ వచ్చిన నారాయణ పార్టీ ఆఫీసుకు రాకుండా వెళ్లిపోతున్నారని, ఇటువంటి వ్యక్తులకు మంత్రి పదవులిస్తే ఇలాగే ఉంటుందని మండల ముఖ్య నాయకులు కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. సుమారు 50 మంది కార్యకర్తలు నారాయణను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న నారాయణ పార్టీ కార్యాలయానికి అర్ధరాత్రి వెళ్లి కార్యకర్తలకు నచ్చజెప్పి.. అక్కడి నుంచి సర్దుకున్నారు.