ఆధిపత్యపోరులో చోడవరం ఇసుక క్వారీ
మేం ముందంటే..మేం ముందంటూ బోడే, నెహ్రూ వర్గాల ఘర్షణ
చట్ట విరుద్ధంగా ర్యాంపుల నిర్మాణం
అనుమతులు లేని ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు
చోద్యం చూస్తున్న అధికారులు
ఇసుక కొనుగోలు చేయలేని పేదలకోసం ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వ పెద్దల జేబులు నింపేందుకే ఆపథకం ప్రవేశపెట్టారని అనతికాలంలో సామాన్యులు సైతం గ్రహించారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి ట్రక్కులకొద్దీ విలువైన ఇసుకను రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తూ అధికారపార్టీ నేతలు అడ్డంగా దోచుకుంటున్న సంగతి విదితమే..అయితే తాజాగా పెనమలూరులో ఇసుక తరలింపు వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి... ఇసుకను ముందు మేం తరలించాలంటూ..కాదు మేమే తరలించాలంటూ ఇరుపక్షాల వారు వాగ్యుద్ధానికి దిగడం చూస్తున్న వారిని విస్మయపరిచింది...ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకోవడానికి కొట్లాడుకుంటున్న వీరు ప్రజాప్రతినిధులేనా అని సామాన్యులు చర్చించుకుంటున్నారు...
పెనమలూరు : జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఇసుక వ్యవహారంలో గతకొంతకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరు తో చోడవరం ఇసుక క్వారీ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులను క్వారీలోకి వెళ్లకుండా అధికారులు అడ్డుకోవడంతో వెంటనే ఆయన క్వారీవద్దకు చేరుకుని హల్‌చల్ చేశారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు తవ్వుకుంటుంటే అడ్డుచెప్పని పోలీసులు, అధికారులు మాకు ఎందుకు అడ్డుచెబుతున్నారని నిలదీశారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి నిషేధిత ప్రాంతంలో ఇద్దరు నేతల అనుచరులను ఇసుక తవ్వుకోవడానికి అనుమతించి, ఉదాసీనంగా ఉండిపోయారు.
వివాదం ఇలా మొదలైంది...
చోడవరం ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రసాద్ అనుచరులు ఓ రైతు భూమి నుంచి ప్రత్యేకంగా క్వారీలోకి దారి వేశారు. ఇది తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులు దగ్గరలోనే మరో రైతు పొలంనుంచి దారి వేశారు. ప్రసాద్ అనుచరులు ఇప్పటికే ఇసుక తవ్వకాలు ప్రారంభించగా, ఆదివారం నెహ్రూ అనుచరు లు ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ అధికారులు వచ్చి నెహ్రూ అనుచరులకు అనుమతులు లేవని అభ్యంతరం తెలిపారు. సమాచారం తెలుసుకున్న నెహ్రూ వెంటనే క్వారీ వద్దకు చేరుకుని ఇసుక తవ్వకాలు చేయరాదని ఉత్తర్వులు ఉంటే చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ఇసుక తవ్వకాలు చేయగా లేనిది, ఇతరులు చేస్తే ఏమి తప్పేంటంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు.
చట్టవిరుద్ధంగా తవ్వకాలు...
చోడవరం ఇసుక క్వారీకి పూర్తిగా అనుమతులు లేవని,నిషేధిత ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. ఏసీపీ సత్యానంద్, సీఐ దామోదర్, ఆర్.ఐ ప్రవీణ్, వీఆర్వో లావణ్య మైనింగ్ సర్వేయర్ చల్లాలు జిల్లా కలెక్టర్ ఇచ్చిన అనుమతులు, సర్వే నివేదిక పరిశీలించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చోడవరం క్వారీలో ఇసుక 14.4 హెక్టార్లలో ఉన్న ట్లు గుర్తించారు. అయితే పర్యావరణ అనుమతులు పొందాలంటే కలెక్టర్‌కు 5 హెక్టార్లకు మించి అనుమతి ఇచ్చే అధికారం లేదు. దీంతో ఈ క్వారీని మూడు సెక్టార్లుగా విభజించి హద్దులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ 1వ సెక్టార్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీనికి కారనేనివారిపాలెం ర్యాంపును ఉపయోగిం చాలి. అయితే టీడీపీ నేత ముందుగా చట్టవిరుద్దంగా ఒక రైతు పొలంలో నుంచి ర్యాం పు వేసి సెక్టార్ 2లో ఇసుక తవ్వకాలు ప్రారంభించాడు. ఇక నెహ్రూ అనుచరులు మరో ర్యాంపు అనుమతులు లేకుండా వేసి సెక్టార్ 3లో తవ్వకాలు మొదలు పెట్టారు. వీరిద్దరు చేస్తున్నవి చట్టవిరుద్ద తవ్వకాలేనని తేలింది.
అధికారుల దాటవేత ధోరణి...
దీనిపై సంబంధిత అధికారులను ‘సాక్షి’ ప్రశ్నించగా ఎవరికివారు సమస్య తమదికాదన్నట్లు బదులిచ్చారు. ఇసుక తవ్వకాలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఏసీపీ సత్యానంద్ మాట్లాడుతూ అధికారికంగా రెవెన్యూ శాఖ నుంచి తమకు ఫిర్యాదు అందితేనే చర్యలు ఉంటాయన్నారు. మైన్స్ అధికారులు తాము హద్దులు నిర్ణయించామని, అతిక్రమించితే రెవెన్యూ అధికారులు మాత్రమే చర్యలు తీసుకోవాలని తాపీగా సెలవిచ్చారు.