అంకెల గారడీ
బడ్జెట్‌పై అన్నివర్గాల పెదవి విరుపు
ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంతంతమాత్రమే
సాక్షి ప్రతినిధి తిరుపతి : రాష్ట్ర శాసన సభలో గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ మసిపూసి మారేడు కాయ చేసినట్టు ఉందని పేర్కొంటున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయించడం, మాయ చేయడం తప్ప అచరణలో మాత్రం అమలు కావటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీ-నీవా, గాలేరు- నగరి, తెలుగగంగ ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. ప్రాజెక్టులను మాత్రం ఏడాది లోపు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారని, అదెలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి, వ్యవసాయ రుణమాఫీ వంటివాటి ఊసే లేకపోవడంపై రైతులు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు సంక్షేమ పథకాలకు గండి కొట్టేలా నిధులు కేటాయింపు ఉందని అన్ని పక్షాల రాజకీయనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతికి నగరానికి..
తిరుపతిలో సైబర్‌స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, కన్వెన్షన్ సెంటర్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంక్యూబేషన్ సెంటర్‌కు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 5000 హెక్టార్లలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
యూనివర్సిటీలకు..
జిల్లాలోని విశ్వవిద్యాలయాలకు గత ఏడాదితో పోలిస్తే కొద్దిమేర నిధులను పెంచారు. ఎస్వీయూకు రూ.163 కోట్లు, ప ద్మావతికి రూ.43.85 కోట్లు, వెటర్నరీ యూనిర్సిటీకి రూ 139.82, ద్రవిడ యూనివర్సిటీకి రూ.12.09 కోట్లు కేటాయించారు.
ప్రాజెక్టులకు అంతంత మాత్రమే..
జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులకు అంతంతమాత్రంగా నిధులు కేటాయించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు రూ.3000 కోట్లకు పైగా నిధులు అవసరం కాగా, రూ.504 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం టెండరు పిలిచిన పనులే రూ.1200 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.2500 కోట్లకు పైగా నిధులు కావాల్సి ఉండగా, రూ.348 కోట్లు మాత్రమే కేటాయించారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు సైతం రూ.78.12 కోట్ల నిధులను కేటాయించడం గమనార్హం.