విజయనగరం టౌన్ : నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఏటా ఆర్థిక సాయం అందిజేస్తామని ప్రముఖ సంపాదకుడు, రచయిత దివంగత కె.ఎన్.వై.పతంజలి సతీమణి ప్రమీల తెలిపారు. కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పతంజలి స్ఫూర్తి పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్టు, వ్యంగ్యరచయిత జి.ఆర్.మహర్షికి మంగళవారం అందజేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమీల మాట్లాడుతూ ఈ ఏడాది స్ఫూర్తి పురస్కారం మహర్షికి అందివ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.
అవార్డు గ్రహీత మహర్షి మాట్లాడుతూ పతంజలి రచనలన్నీ సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి వచ్చే బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి మనుషుల జీవితాల నుంచి వచ్చినవేనని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ముఖ్య అతిధిగా జెడ్పీ సీఈఓ గనియా రాజకుమారి మాట్లాడుతూ 35 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన పతంజలి అందరికీ స్పూర్తిదాయకమన్నారు.
అనంతరం కెఎన్‌వై పతంజలి - సాహిత్యం అనే అంశంపై ప్రసాదవర్మ (విశాఖ) మాట్లాడుతూ మనుషులు మనుషులుగానే ఉండాలి. వారి మధ్య అసమానతలు అనేవి ఉండరాదని పతంజలి తన కథల్లో చూపించగలిగారన్నారు. జి.ఆర్.మహర్షి - సాహిత్యంపై ఎన్.కె.బాబు ప్రసంగించారు. భీశెట్టి బాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాలుగెస్సుల రాజు, చాగంటి తులసి, రంగారావు, కృష్ణాజీ, పివి.నరసింహరాజు పాల్గొన్నారు.
నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం
Published Wed, Mar 30 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM
Advertisement
Advertisement