ప్రొద్దుటూరు క్రైం : ‘ఏమే..నేను పిలిస్తే బయటికి రావా.. ఎంత అహంకారం నీకు’ అంటూ అతను నోటికి వచ్చినట్లు ఆమెను దూషించాడు. అంతటితో ఆగక పక్కనే ఉన్న వాకిలి గడప చెక్కతో కొట్టి గాయ పరిచాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరు మండలంలోని మీనాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బుగ్గపట్నం సుబ్బరాయుడుకు భార్య పద్మావతితోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సుబ్బరాయుడు బేల్దారి పనికి వెళ్తుండగా పద్మావతి గ్రామంలో కొందరి బట్టలు ఉతుకుతుంటుంది. రజకులు కావడంతో వారు కుల వృత్తిని వదులుకోలేదు. ఈ క్రమంలో గ్రామంలోని ఫైనాన్సియర్ శివకృష్ణ శుక్రవారం సాయంత్రం ఇస్త్రీ బట్టలు తీసుకొని రమ్మని చెప్పడంతో.. ఇంట్లో ఉన్న ఒక జత బట్టలను పద్మావతి తన కుమార్తె నందిని చేత పంపించింది. ‘నేను బట్టలు తీసుకొని రమ్మని చెప్పింది మీ అమ్మను కదా .. నువ్వెందుకు వచ్చావు’ అని అతను నందినితో అన్నాడు. ‘వెంటనే మీ అమ్మను రమ్మని చెప్పు’ అని బాలికతో చెప్పి పంపించాడు.
విచక్షణా రహితంగా చితక బాదాడు
కొద్ది సేపటి తర్వాత శివకృష్ణ ఆమె ఇంటి వద్దకు వచ్చి బయటికి రా అంటూ అరిచాడు. పద్మావతి బయటికి రాగా పక్కనే ఉన్న వాకిలి గడప చెక్క తీసుకొని ఆమె చెయ్యిపై కొట్టడంతో రక్త గాయాలు అయ్యాయి. నడి వీధిలో తనకు అవమానం జరిగిందని భావించిన పద్మావతి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న మాత్రలను పొడి చేసుకొని మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పద్మావతి ఫిర్యాదు మేరకు శివకృష్ణపై శనివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment