సంతకవిటి : నిన్నమొన్నటి వరకూ పచ్చగా ఉన్న మామిడిపల్లి గ్రామం నేడు మొండి గోడలతో శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 60 ఇళ్లు కాలిపోయిన విషయం విదితమే. పూరిపాకల్లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలు అగ్ని దేవడు ఆగ్రహంతో నేడు నిలువనీడలేక చెట్టుకొకరు..పుట్టకొక్కరయ్యారు. బాధితులంతా గ్రామంలోని షిర్డీసాయి మందిరం వద్ద, పలువురు ఇళ్ల గడపల్లోనూ తలదాచుకుంటున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కాలిపోయిన వస్తు సామగ్రిని చూసి రోదిస్తున్నారు.
నష్టం రూ. 60 లక్షలు
అగ్ని ప్రమాద నష్టం సుమారు రూ 60 లక్షలు ఉంటుందని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. ఇన్‌చార్జి తహశీల్దార్ బి.సూరమ్మ, డీటీ సాయికామేశ్వరరావు, ఆర్‌ఐ రామారావులు గ్రామానికి చేరుకుని కాలిపోయిన ఇళ్ల వివరాలను గురువారం సేకరించారు. ఆస్తినష్టం మీద ఆరాతీసి నివేదికలు రూపొందించుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అరసవల్లి కొండలరావు, రాములమ్మ, బేపల దుర్గయ్య, గూనాపు సీతారాంలకు చెందిన నగదుతో పాటు తిండి నిమిత్తం ఉంచుకున్న ధాన్యం కాలిపోయినట్లుగా, మండల గన్నెప్పడు, బంటుపల్లి లక్ష్మణరావు, మాటూరు కాంతమ్మ, సరోజనమ్మ, సెగల్ల అప్పడు, నాగం, పైల లక్ష్మణ, సత్యం, సూర్యనారాయణ తదితరులుకు చెందిన ఎల్‌ఐసీ బాండ్లు, పిల్లల సర్టిఫికెట్లు,
నగదు కాలిపోయినట్టు రోదిస్తున్నారు. అరసవల్లి చిన్నోడు, బేపల చింతయ్య, నందయ్య, ఉంకుల లక్ష్మణరావు, ఆదినారాయణ, అరసవల్లి చిన్నారావు, బంటుపల్లి నారాయణరావు, పైల రామారావులు కూడా బాగా నష్టపోయారు. పి.రామప్పడు, చిన్నోడు, చిన్నారావులు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి ముగ్గురు ఇల్లు కాలిపోవడంతో నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. అలాగే పి.అప్పలసూరి, అప్పమ్మ, రాములమ్మ, శంకుడు, సీతమ్మ వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి ఇల్లు కూడా దహనం కావడంతో రోదిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది రజక, ఎస్సీ కుటుంబాలకు చెందిన నిరుపేదలే కావడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
బంధువుల ఓదార్పు
బంధువులను పరామర్శించేందుకు వచ్చిన వారితో మామిడిపల్లి రద్దీగా మారింది.
ఓదార్పులు, రోదనలతో గ్రామంలో
విషాద ఛాయలు నెలకున్నాయి. షిర్డీ సాయి మందిరం వద్ద కొంతమంది బాధితులు తలదాచుకుంటున్నారు. ఇక్కడే భోజన ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు.
గూడుపోయింది గోడు మిగిలింది
Published Fri, May 22 2015 2:23 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement