Santakaviti
-
హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు
రాజాం(విజయనగరం జిల్లా): ఆ యువకుడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. రాణిస్తున్నది క్రికెట్లో. చిన్పప్పుడు నుంచి చదువులో ముందుండే కుర్రాడు.. తల్లిదండ్రులు అనుకున్నట్టే చిన్న వయస్సులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. అక్కడితో ఆగకుండా ఊర్లోని పొలాలు, కల్లాల్లో ఆడిన క్రికెట్ ఆటపై మక్కువతో సాధన చేశాడు. శిక్షణలో రాటుదేలి హంగేరీ దేశ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఆయనే.. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్. చదువులో దిట్ట.. భవానీ ప్రసాద్‌ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు వ్యవసాయదారులు. భవానీప్రసాద్ 1 నుంచి 7వ తరగతి వరకూ సిరిపురంలోని శివానంద హైస్కూల్లోను, 8 నుంచి 10 తరగతులను సింహాచలం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో పూర్తిచేశాడు. పదోతరగతిలో 490 మార్కులు సాధించాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురులకు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి వెయ్యికు 929 మార్కులు సాధించాడు. ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ను ఐటీ విభాగంలో పూర్తిచేశాడు. చివరి సంవత్సరంలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అక్కడ మూడేళ్లు పనిచేసిన అనంతరం టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నత ఉద్యోగం రావడంతో షిఫ్ట్ అయ్యాడు. కంపెనీ తరఫున హంగేరీ వెళ్లి స్థిరపడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో రాణిస్తూనే క్రికెట్‌పై దృష్టిసారించిన 30 ఏళ్ల భవానీ ప్రసాద్ ఆ దేశ జట్టులో చోటు సంపాదించాడు. బౌలర్‌గా రాణింపు.. చిన్నప్పుడు గ్రామంలో సరదాగా ఆడిన క్రికెట్.. భవానీ ప్రసాద్‌కు హంగేరీ దేశంలో విపరీతమైన క్రేజీ తెచ్చిపెట్టింది. ఉద్యోగరీత్యా హంగేరీ వెళ్లిన ఆయన అక్కడ బెంగుళూరుకు చెందిన సత్యదీప్అశ్వద్నారాయణ ఏర్పాటుచేసిన హంగేరీ కోబ్రా క్రికెట్ క్లబ్లో చేరాడు. ఆ దేశ క్రికెటర్లతో పాటు వివిధ దేశాలనుంచి వచ్చి హంగేరీలో స్థిరపడినవారంతా ఆ క్లబ్లో చేరి ప్రతిభను చాటేవారు. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌ల తరహాలో కోబ్రాక్లబ్ అక్కడ జాతీయ స్థాయిలో జరిగే వివిధ క్లబ్‌లతో పోటీపడేది. ఆ పోటీల్లో 2018 నుంచి భవానీప్రసాద్ ఆడుతూ వచ్చాడు. చివరకు ఆ దేశ క్రికెట్ సెలక్షన్ కమిటీ భవానీ ప్రసాద్‌ను దేశ జట్టులోకి తీసుకుంది. 2021 నుంచి ఏడాది వ్యవధిలో హంగేరీ 11దేశాలతో ఆడిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఓడిపోవాల్సిన తమ జట్టును గెలిపించాడు. దీంతో హంగేరీ టీంలో ఉత్తమ బౌలర్‌గా స్థానం దక్కించుకున్నాడు. జెర్సీ నంబర్–78తో ఆడుతున్న భవానీప్రసాద్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించడంలో దిట్ట. కుటుంబ నేపథ్యం.. భవానీ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగికాగా, సోదరి స్వప్న, సోదరుడు అనీల్‌లు బ్యాంకు ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు ఏడాది వ్యవధిలో మరణించడం వీరిలో విషాదం నింపింది. హంగేరీకి అండగా... క్రికెట్‌ను ఇష్టపడనివారు, ప్రేమించనివారు ఉండరు. అందులో నేను కూడా ఒకడ్ని. చిన్నప్పుడు పిచ్చాపాటిగా క్రికెట్ ఆడేవాడిని. హంగేరీ వచ్చిన తరువాత కోచ్ సత్యదీప్అశ్వద్నారాయణ వద్ద శిక్షణ పొందాను. ప్రతిభను గుర్తించి క్లబ్ పెట్టారు. మాకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హంగేరీ ఐసీసీ ర్యాంకులో 54వ స్థానంలో ఉంది. ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. మా తల్లిదండ్రులు ఆశయాలు మేరకు ఇతరులకు సాయం చేయడమే ముందున్న కర్తవ్యం. – అదపాక భవానీ ప్రసాద్, క్రీడాకారుడు -
వయసు 48.. రక్తదానం 47 సార్లు
ఆదర్శంగా నిలుస్తున్న సంతకవిటికి చెందిన గుప్త ఏడాదికి రెండు సార్లు రక్తదానం ఎందరికో ప్రాణం పోస్తున్న వైనం రక్త దాతగా పేరు సార్థకం బయోడేటా... పేరు: పొట్నూరు గుప్త ఊరు: సంతకవిటి ప్రత్యేకత: ఇప్పటికి 47 సార్లు రక్తదానం చేయడం జీవనాధారం: పాన్‌షాపు చదువు: ఇంజినీరింగ్, వయసు: 48 ఏడాదికి రక్తదానం చేసిన సందర్భాలు సగటున : 02 నుంచి 03 తొలిసారి రక్తదానం చేసిన ప్రాంతం: మహారాష్ట్రలోని లొట్టూరులో(1985లో) 47వ రక్తదానం చేసిన ప్రాంతం: సంతకవిటి సత్యసాయి మందిరం(2016, జూలై–27న) రక్తదానానికి భయపడే ఎందరికో ఆయన స్ఫూర్తి. ఒకటి రెండు సార్లు కాదు ఇప్పటి వరకు 47 సార్లు రక్తం దానం చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. ప్రాణం పోశారు. ఆరోగ్యంగా, ఆత్మసంతృప్తితో జీవిస్తున్నారు. తల్లిదండ్రుల చెంతనే ఉండాలన్న ఆకాంక్షతో సంతకవిటిలో పాన్‌షాపు నిర్వహిస్తూ ఆనందకర జీవనం సాగిస్తున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఘనత ఇది. సంతకవిటి: మండల కేంద్రంలోని పాత తహశీల్దార్ కార్యాలయం పక్కన పాన్‌షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న పొట్నూరు గుప్త ఇంజినీరింగ్ చదివారు. 19వ ఏట నుంచి రక్తదానం చేయడం ఆరంభించారు. ఇప్పటి వరకు 48 ఏళ్ల వయసులో 47 సార్లు రక్తదానం చేశారు. ఏడాదికి రెండు సార్లు రక్తదానం చేస్తారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి మూడు పర్యాయాలు కూడా చేస్తున్నారు. రక్తం కావాలని ఎవరు సంప్రదించినా నేనున్నాంటూ ముందుకు వస్తారు. స్వచ్ఛందంగా వెళ్లి రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. వారికి ప్రాణం పోస్తున్నారు. ఇప్పటివరకు ఈయనకు అనారోగ్యం అన్నది తెలియదు. ఆరోగ్యంగా, చలాకీగా ఉంటారు. రక్తదాతగా పేరు పొందారు. సంతకవిటి మండలంలోని గరికిపాడు గ్రామానికి చెందిన ఎం.సంగంనాయుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా రక్తం అందించి జీవం పోశారు. మరో ఆరుగురు వ్యక్తులకు అత్యసవసర సమయంలోనే రక్తందానం చేశారు. మిగిలిన రోజుల్లో ప్రతి ఆరు నెలలకోసారి రక్తదానం చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ప్రాణం నిలబడుతుంది.. రక్తదానం చేస్తే మన ప్రాణాలేమి పోవు. శరీరంలో రక్తం వృథాయే తప్ప ప్రయోజనం ఉండదు. అదే రక్తాన్ని దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడవచ్చు. రక్తదానం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. బద్ధకం, తలనొప్పి, కీళ్ల నొప్పులు ఉండవు. రక్తం ఇచ్చిన మూడునెలల్లో రికవరీ అవుతుంది. గ్రామంలోని యువకులు రక్తదానం చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. – పొట్నూరు గుప్త, రక్తదాత, సంతకవిటి -
అరటిగెల.. ఆరడుగులు!
ఒక్కో గెలకు 630కి పైగా కాయలు సాధారణంగా కూరటి గెలలు రెండు నుంచి మూడు అడుగుల పొడవుండి, మహా అయితే 80 నుంచి 150 మధ్య కాయలుంటాయి. కాని శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శేషాద్రిపురం గ్రామంలో నంబాళ్ళ అప్పలాచార్యులు ఇంటి పెరడులోని అరటి చెట్లు ఆరడుగులకు పైగా పొడవున్న అరటి గెలలు వేస్తున్నాయి. ఒక్కో గెలకు దాదాపు 630కి పైగా కాయలతో పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ రైతు పెరడులో వేసిన అరటిమొక్కల్లో మూడు మొక్కలు ఇలాంటి గెలలు వేశాయి. ఇటీవల ఒక గెల కోయగా మిగిలిన రెండు కోతకు సిద్ధంగా ఉన్నాయి. వీటిని విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి వేశామని, ఎనిమిది నెలల వయస్సు ఉంటుందని రైతు అప్పలాచార్యులు అన్నారు. -శేషాద్రిపురం(సంతకవిటి) -
గూడుపోయింది గోడు మిగిలింది
సంతకవిటి : నిన్నమొన్నటి వరకూ పచ్చగా ఉన్న మామిడిపల్లి గ్రామం నేడు మొండి గోడలతో శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 60 ఇళ్లు కాలిపోయిన విషయం విదితమే. పూరిపాకల్లో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలు అగ్ని దేవడు ఆగ్రహంతో నేడు నిలువనీడలేక చెట్టుకొకరు..పుట్టకొక్కరయ్యారు. బాధితులంతా గ్రామంలోని షిర్డీసాయి మందిరం వద్ద, పలువురు ఇళ్ల గడపల్లోనూ తలదాచుకుంటున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కాలిపోయిన వస్తు సామగ్రిని చూసి రోదిస్తున్నారు. నష్టం రూ. 60 లక్షలు అగ్ని ప్రమాద నష్టం సుమారు రూ 60 లక్షలు ఉంటుందని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. ఇన్చార్జి తహశీల్దార్ బి.సూరమ్మ, డీటీ సాయికామేశ్వరరావు, ఆర్ఐ రామారావులు గ్రామానికి చేరుకుని కాలిపోయిన ఇళ్ల వివరాలను గురువారం సేకరించారు. ఆస్తినష్టం మీద ఆరాతీసి నివేదికలు రూపొందించుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అరసవల్లి కొండలరావు, రాములమ్మ, బేపల దుర్గయ్య, గూనాపు సీతారాంలకు చెందిన నగదుతో పాటు తిండి నిమిత్తం ఉంచుకున్న ధాన్యం కాలిపోయినట్లుగా, మండల గన్నెప్పడు, బంటుపల్లి లక్ష్మణరావు, మాటూరు కాంతమ్మ, సరోజనమ్మ, సెగల్ల అప్పడు, నాగం, పైల లక్ష్మణ, సత్యం, సూర్యనారాయణ తదితరులుకు చెందిన ఎల్ఐసీ బాండ్లు, పిల్లల సర్టిఫికెట్లు, నగదు కాలిపోయినట్టు రోదిస్తున్నారు. అరసవల్లి చిన్నోడు, బేపల చింతయ్య, నందయ్య, ఉంకుల లక్ష్మణరావు, ఆదినారాయణ, అరసవల్లి చిన్నారావు, బంటుపల్లి నారాయణరావు, పైల రామారావులు కూడా బాగా నష్టపోయారు. పి.రామప్పడు, చిన్నోడు, చిన్నారావులు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి ముగ్గురు ఇల్లు కాలిపోవడంతో నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. అలాగే పి.అప్పలసూరి, అప్పమ్మ, రాములమ్మ, శంకుడు, సీతమ్మ వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి ఇల్లు కూడా దహనం కావడంతో రోదిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది రజక, ఎస్సీ కుటుంబాలకు చెందిన నిరుపేదలే కావడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బంధువుల ఓదార్పు బంధువులను పరామర్శించేందుకు వచ్చిన వారితో మామిడిపల్లి రద్దీగా మారింది. ఓదార్పులు, రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు నెలకున్నాయి. షిర్డీ సాయి మందిరం వద్ద కొంతమంది బాధితులు తలదాచుకుంటున్నారు. ఇక్కడే భోజన ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు.