రక్తదానం చేస్తున్న పొట్నూరు గుప్త
-
ఆదర్శంగా నిలుస్తున్న సంతకవిటికి చెందిన గుప్త
-
ఏడాదికి రెండు సార్లు రక్తదానం
-
ఎందరికో ప్రాణం పోస్తున్న వైనం
-
రక్త దాతగా పేరు సార్థకం
బయోడేటా...
పేరు: పొట్నూరు గుప్త
ఊరు: సంతకవిటి
ప్రత్యేకత: ఇప్పటికి 47 సార్లు రక్తదానం చేయడం
జీవనాధారం: పాన్‌షాపు
చదువు: ఇంజినీరింగ్, వయసు: 48
-
ఏడాదికి రక్తదానం చేసిన సందర్భాలు సగటున : 02 నుంచి 03
-
తొలిసారి రక్తదానం చేసిన ప్రాంతం: మహారాష్ట్రలోని లొట్టూరులో(1985లో)
-
47వ రక్తదానం చేసిన ప్రాంతం: సంతకవిటి సత్యసాయి మందిరం(2016, జూలై–27న)
రక్తదానానికి భయపడే ఎందరికో ఆయన స్ఫూర్తి. ఒకటి రెండు సార్లు కాదు ఇప్పటి వరకు 47 సార్లు రక్తం దానం చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. ప్రాణం పోశారు. ఆరోగ్యంగా, ఆత్మసంతృప్తితో జీవిస్తున్నారు. తల్లిదండ్రుల చెంతనే ఉండాలన్న ఆకాంక్షతో సంతకవిటిలో పాన్‌షాపు నిర్వహిస్తూ ఆనందకర జీవనం సాగిస్తున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఘనత ఇది.
సంతకవిటి: మండల కేంద్రంలోని పాత తహశీల్దార్ కార్యాలయం పక్కన పాన్‌షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న పొట్నూరు గుప్త ఇంజినీరింగ్ చదివారు. 19వ ఏట నుంచి రక్తదానం చేయడం ఆరంభించారు. ఇప్పటి వరకు 48 ఏళ్ల వయసులో 47 సార్లు రక్తదానం చేశారు. ఏడాదికి రెండు సార్లు రక్తదానం చేస్తారు. ఒక్కోసారి అవసరాన్ని బట్టి మూడు పర్యాయాలు కూడా చేస్తున్నారు. రక్తం కావాలని ఎవరు సంప్రదించినా నేనున్నాంటూ ముందుకు వస్తారు. స్వచ్ఛందంగా వెళ్లి రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. వారికి ప్రాణం పోస్తున్నారు. ఇప్పటివరకు ఈయనకు అనారోగ్యం అన్నది తెలియదు. ఆరోగ్యంగా, చలాకీగా ఉంటారు. రక్తదాతగా పేరు పొందారు. సంతకవిటి మండలంలోని గరికిపాడు గ్రామానికి చెందిన ఎం.సంగంనాయుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా రక్తం అందించి జీవం పోశారు. మరో ఆరుగురు వ్యక్తులకు అత్యసవసర సమయంలోనే రక్తందానం చేశారు. మిగిలిన రోజుల్లో ప్రతి ఆరు నెలలకోసారి రక్తదానం చేయడం ఆయనకు అలవాటుగా మారింది.
ప్రాణం నిలబడుతుంది..
రక్తదానం చేస్తే మన ప్రాణాలేమి పోవు. శరీరంలో రక్తం వృథాయే తప్ప ప్రయోజనం ఉండదు. అదే రక్తాన్ని దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడవచ్చు. రక్తదానం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. బద్ధకం, తలనొప్పి, కీళ్ల నొప్పులు ఉండవు. రక్తం ఇచ్చిన మూడునెలల్లో రికవరీ అవుతుంది. గ్రామంలోని యువకులు రక్తదానం చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది.
– పొట్నూరు గుప్త, రక్తదాత, సంతకవిటి