బౌలింగ్ వేస్తున్న భవానీ ప్రసాద్
రాజాం(విజయనగరం జిల్లా): ఆ యువకుడు చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. రాణిస్తున్నది క్రికెట్‌లో. చిన్పప్పుడు నుంచి చదువులో ముందుండే కుర్రాడు.. తల్లిదండ్రులు అనుకున్నట్టే చిన్న వయస్సులోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడు. అక్కడితో ఆగకుండా ఊర్లోని పొలాలు, కల్లాల్లో ఆడిన క్రికెట్ ఆటపై మక్కువతో సాధన చేశాడు. శిక్షణలో రాటుదేలి హంగేరీ దేశ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఆయనే.. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్.
చదువులో దిట్ట..
భవానీ ప్రసాద్‌ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు వ్యవసాయదారులు. భవానీప్రసాద్ 1 నుంచి 7వ తరగతి వరకూ సిరిపురంలోని శివానంద హైస్కూల్‌లోను, 8 నుంచి 10 తరగతులను సింహాచలం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్‌లో పూర్తిచేశాడు. పదోతరగతిలో 490 మార్కులు సాధించాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురులకు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి వెయ్యికు 929 మార్కులు సాధించాడు.
ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ను ఐటీ విభాగంలో పూర్తిచేశాడు. చివరి సంవత్సరంలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అక్కడ మూడేళ్లు పనిచేసిన అనంతరం టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నత ఉద్యోగం రావడంతో షిఫ్ట్ అయ్యాడు. కంపెనీ తరఫున హంగేరీ వెళ్లి స్థిరపడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో రాణిస్తూనే క్రికెట్‌పై దృష్టిసారించిన 30 ఏళ్ల భవానీ ప్రసాద్ ఆ దేశ జట్టులో చోటు సంపాదించాడు.
బౌలర్‌గా రాణింపు..
చిన్నప్పుడు గ్రామంలో సరదాగా ఆడిన క్రికెట్.. భవానీ ప్రసాద్‌కు హంగేరీ దేశంలో విపరీతమైన క్రేజీ తెచ్చిపెట్టింది. ఉద్యోగరీత్యా హంగేరీ వెళ్లిన ఆయన అక్కడ బెంగుళూరుకు చెందిన సత్యదీప్‌అశ్వద్‌నారాయణ ఏర్పాటుచేసిన హంగేరీ కోబ్రా క్రికెట్ క్లబ్‌లో చేరాడు. ఆ దేశ క్రికెటర్లతో పాటు వివిధ దేశాలనుంచి వచ్చి హంగేరీలో స్థిరపడినవారంతా ఆ క్లబ్‌లో చేరి ప్రతిభను చాటేవారు. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌ల తరహాలో కోబ్రాక్లబ్ అక్కడ జాతీయ స్థాయిలో జరిగే వివిధ క్లబ్‌లతో పోటీపడేది. ఆ పోటీల్లో 2018 నుంచి భవానీప్రసాద్ ఆడుతూ వచ్చాడు. చివరకు ఆ దేశ క్రికెట్ సెలక్షన్ కమిటీ భవానీ ప్రసాద్‌ను దేశ జట్టులోకి తీసుకుంది.
2021 నుంచి ఏడాది వ్యవధిలో హంగేరీ 11దేశాలతో ఆడిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఓడిపోవాల్సిన తమ జట్టును గెలిపించాడు. దీంతో హంగేరీ టీంలో ఉత్తమ బౌలర్‌గా స్థానం దక్కించుకున్నాడు. జెర్సీ నంబర్–78తో ఆడుతున్న భవానీప్రసాద్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించడంలో దిట్ట.
కుటుంబ నేపథ్యం..
భవానీ ప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికాగా, సోదరి స్వప్న, సోదరుడు అనీల్‌లు బ్యాంకు ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు ఏడాది వ్యవధిలో మరణించడం వీరిలో విషాదం నింపింది.
హంగేరీకి అండగా...
క్రికెట్‌ను ఇష్టపడనివారు, ప్రేమించనివారు ఉండరు. అందులో నేను కూడా ఒకడ్ని. చిన్నప్పుడు పిచ్చాపాటిగా క్రికెట్ ఆడేవాడిని. హంగేరీ వచ్చిన తరువాత కోచ్ సత్యదీప్‌అశ్వద్‌నారాయణ వద్ద శిక్షణ పొందాను. ప్రతిభను గుర్తించి క్లబ్ పెట్టారు. మాకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హంగేరీ ఐసీసీ ర్యాంకులో 54వ స్థానంలో ఉంది. ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. మా తల్లిదండ్రులు ఆశయాలు మేరకు ఇతరులకు సాయం చేయడమే ముందున్న కర్తవ్యం.
– అదపాక భవానీ ప్రసాద్, క్రీడాకారుడు
Comments
Please login to add a commentAdd a comment