విశాఖపట్నం గాజువాకలోని అగ్రిగోల్డ్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.
విశాఖపట్నం : విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్డులోని అగ్రిగోల్డ్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో కీలక ఫైళ్లతోపాటు కంప్యూటర్లు కూడా దగ్ధమైనాయి.
అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించిందని అగ్రిగోల్డ్ యాజమాన్యం తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.