జీడిమెట్ల, న్యూస్‌లైన్: పారిశ్రామికవాడలోని ఓ రసాయనాల తయారీ పరిశ్రమలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలంటుకున్న వెంటనే కార్మికులు పరిశ్రమ నుంచి పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా, లక్షల్లో ఆస్తినష్టం ఉంటుందని తెలిసింది. వివరాలు... జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఫేజ్-3లో యూసుఫ్, అక్రమ్, హుస్సేన్‌లు భారత్ ఫ్లెక్సో గ్రాఫైట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కెమికల్ సాల్వెంట్స్‌ను తయారు చేసి విక్రయిస్తుంటారు. కాగా ఆదివారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఐదుగురు కార్మికులు సాల్వెంట్స్‌ను తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు లేచాయి. కార్మికులు భయంతో బయటకు పరుగు తీశారు.
పరిశ్రమలో భారీ ఎత్తున సాల్వెంట్స్ నిల్వ ఉండటంతో మంటలు ఒక్కసారిగా అంటుకుని క్షణాల్లో పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. మంటల ధాటికి పరిశ్రమలోని డ్రమ్ములు 50 అడుగుల మేర గాల్లోకి ఎగిరి పడటంతో భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల, సనత్‌నగర్ ఫైర్‌స్టేషన్ల సిబ్బందితో పాటు హెటిరో పరిశ్రమ ఫైర్ సిబ్బంది వచ్చి.. ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. జీడిమెట్ల సీఐ సుదర్శన్ ఇతర ప్రాంతాల నుంచి ఫోమ్, వాటర్ ట్యాంకర్‌లను తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. ప్రమాదంలో సుమారు 200 కెమికల్ డ్రమ్ములు కాలిపోయాయి. పరిశ్రమ యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత నష్టం జరిగిందనేది తెలియరాలేదు. అయితే, లక్షల్లో ఆస్తినష్టం ఉంటుందని స్థానికులంటున్నారు. సంఘటనా స్థలా న్ని బాలానగర్ ఏసీపీ నాగరాజురెడ్డి, వైఎస్సాఆర్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం కార్యదర్శి సురేందర్‌రెడ్డి తదితరులు సందర్శించారు.
అనుమతి లేని పరిశ్రమ..
ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. సాల్వెంట్స్‌ను తయారు చేసి భారీగా నిల్వ చేస్తున్నారు. వీరి వద్ద ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్ కూడా లేదు. అగ్నిప్రమాదం జరిగితే అదుపు చేసేందుకు అవసరమైన నియంత్రణ పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. ఈ పరిశ్రమకు చెందిన మరో బ్రాంచ్‌లో 2012 ఆగస్టు 15న అగ్ని ప్రమాదం జరిగింది.
తరుచూ ప్రమాదాలు.. పట్టించుకోని పీసీబీ
ఇటీవల సుభాష్‌నగర్‌లోని పరిశ్రమలోన రసాయనాలు పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, స్టాలిన్ పెయింట్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి 10 రోజులు గడవక ముందే ‘భారత్ ఫ్లెక్సో’ పరిశ్రమలో ప్రమాదం జరగడం పీసీబీ అధికారుల పని తీరుకు అద్దం పడుతోంది. మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు అనుమతి లేని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు నిబంధనలు పట్టించుకోని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
Published Mon, Dec 9 2013 12:50 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement