
బూడిదగా మారిన ఏటీఎం కేంద్రం
పెదవేగి (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండల కేంద్రంలో ఓ బ్యాంకు ఏటీఎం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయింది. మండల తహశీల్దార్ కార్యాలయం వద్దనున్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
మంటలకు ఏటీఎం కేంద్రంలో ఏమీ మిగలకుండా అంతా బూడిదగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు మేనేజర్ చాంబర్ కూడా కొద్ది మేర దగ్ధం అయినట్టు తెలుస్తోంది. కాగా ఏటీఎం యంత్రంలో నగదు ఎంత ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి బ్యాంకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.