కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
► ఒకరికి తీవ్రగాయాలు
► భారీగా ఆస్తి నష్టం
ఒంగోలు: ఒంగోలులోని వ్వవసాయ రసాయనాల తయారీ కేంద్రం భగీరథ కెమికల్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి మంటలు వెలువడి మూడంతుస్తుల ప్రధాన ఉత్పత్తి కేంద్రం నిలువునా అగ్నికి ఆహుతైంది. నాలుగు అగ్నిమాపక వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బందిలో కిరణ్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పరిశ్రమ యాజమాన్య వర్గాలు తెలిపాయి. గాయపడిన కార్మికుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రధాన రియాక్టర్ల వేడివల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ వినయ్‌చంద్ పరిశీలించి కార్మికులతో ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు.