నిలువెల్లా నిర్లక్ష్యం | fire accident is happend due to negligence | Sakshi
Sakshi News home page

నిలువెల్లా నిర్లక్ష్యం

Published Mon, Dec 30 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

నిలువెల్లా నిర్లక్ష్యం

నిలువెల్లా నిర్లక్ష్యం

ఎన్ని ప్రమాదాలు జరిగినా పాఠాలు నేర్వని వైనం
     మాటలకే పరిమితమైన ప్రయాణికుల భద్రత
     అమలుకు నోచుకోని రైల్వే బడ్జెట్ హామీలు


 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామ శివారులో 45 నిండు ప్రాణాలను బలిగొన్న బస్సు ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్న తరుణంలో అదే తరహా ప్రమాదానికి గురైంది బెంగళూరు-నాందెడ్ ఎక్స్‌ప్రెస్. ఏసీ బోగీ మంటల్లో చిక్కుకోవడంతో 26 నిండు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం రాష్ట్రంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నమోదైంది. దీనికి కారణాలను ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పటం కష్టమే అయినా.. రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యాన్ని తోసిపుచ్చలేని పరిస్థితి నెలకొంది. రైలు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యమని ప్రతి రైల్వే బడ్జెట్ సమయంలో మంత్రులు ఘనంగా చెప్పటం పరిపాటి. కానీ అవేవీ ప్రస్తుతం అమలు కావడంలేదు. ప్రమాదానికి కారణాల సంగతి పక్కనపెడితే.. మంటలు వేగంగా వ్యాపించకుండా చూడాల్సిన ఏర్పాట్లపై రైల్వేమంత్రి బన్సల్ గత బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే..
 
     రైలు ఏసీ బోగీలోపల నిప్పును గ్రహించలేని మెటీరియల్‌నే వాడాలి. ఫ్లోరింగ్‌పైన  నిప్పు అంటుకోని పీవీసీని పరచాలి. రూఫ్ సీలింగ్‌కు లామినేటెడ్ షీట్స్‌ను మాత్రమే వినియోగించాలి.
 
     లోపల వినియోగించే వైర్లు, లైటింగ్ మెటీరియల్, టెర్మినల్ బోర్డులు, కనెక్టర్లకు వాడే మెటీరియల్ కూడా ఫైర్ ప్రూఫ్‌తో ఉండాలి.
 
     నిప్పును, పొగను ముందుగానే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అలాగే పొగ ఉన్నట్టు గుర్తించగానే అలారం మోగించే పరికరాలను బోగీల్లో ఉంచాలి.
 
     ఏసీ బోగీలో,ప్యాంట్రీ కార్‌లో విధిగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలి.
     అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా కిటికీలు, డోర్లు తెరచుకోవాలి.
     ఎక్కువ రద్దీ ఉన్నప్పటికీ తొందరగా వెళ్లిపోయేలా రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫామ్స్, స్టెయిర్ కేసులు ఏర్పాటు చేయాలి.
 
     ప్రతి స్టేషన్‌లో లక్ష లీటర్ల కెపాసిటీ గల వాటర్‌సంపులు, పంప్ రూమ్‌లుండాలి.
 అయితే ఇవేవీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. నిప్పును, పొగను ముందుగానే గుర్తించే పరికరాల ఏర్పాటు హామీ కొత్తది కానప్పటికీ.. బన్సల్ ప్రకటన తర్వాత కూడా ఇవి అందుబాటులోకి రాలేదు. వీటిని రెండు, మూడు రాజధాని లాంటి హైస్పీడ్ రైళ్లకే పరిమితం చేశారు. అలారం ఏర్పాటు కూడా 40 రైళ్లకు మించి లేదు. కొన్ని రైళ్లలో మాత్రం నిప్పును ఆర్పే స్ప్రింక్లర్లు ఎక్‌స్టింగ్విషర్లు ఉంటున్నాయి. కానీ అవెక్కడున్నాయో ప్రయాణికులకు తెలియదు. శనివారం నాటి ప్రమాదంలో ఏసీ బోగీలో ఇవి ఉన్నా ప్రయాణికులు వినియోగించలేకపోయారు.  గతంలో ప్రతి ఏసీ బోగీలో కచ్చితంగా నైపుణ్యం ఉన్న టెక్నీషియన్లు ఉండే విధానం అమలులో ఉండేది. వీరినే ఎస్కార్ట్ టీంగా వ్యవహరిస్తారు.
 
  ఓ టెక్నీషియన్, మరో సహాయ టెక్నీషియన్ ఉండేవారు. ప్రతి అరగంటకు ఓసారి ఆ బోగీలో అడుగడుగునా వీరు త నిఖీ చేసేవారు. కొంత కాలం క్రితం ఒక్కో టెక్నీషియన్‌కు ఐదు బోగీల బాధ్యత అప్పగించారు. సహాయ టెక్నీషియన్ మాత్రం ప్రతి ఏసీ బోగీలో ఉండేవాడు. ప్రయాణికులకు దిండు దుప్పట్లతో కూడిన బెడ్ రోల్స్ కూడా ఇతనే అందించేవాడు. కానీ మూడేళ్ల క్రితం ఖర్చును భారీగా తగ్గించుకునే క్రమంలో బెడ్‌రోల్స్ బాధ్యతను ఔట్‌సోర్సింగ్ సంస్థలకు అప్పగించారు. దీంతో సహాయ టెక్నీషియన్ పోస్టులకు రైల్వే రాంరాం చెప్పేయడంతో ప్రధాన టెక్నీషియన్లపైనే భారం పడింది. దీంతో వారు బోగీలను తనిఖీ చేసే బాధ్యతను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏసీ బోగీలో చల్లదనం కోసం రెండు ఏసీ ప్యానల్స్ ఉంటాయి. నిర్ధారిత సమయాల్లో ఇవి ఒకదాని తర్వాత ఒకటి పనిచేయాలి. ఒక ప్యానెల్ వేడెక్కగానే దాన్ని నిలిపేసి రెండో ప్యానెల్‌ను ఆన్ చేసే బాధ్యత టెక్నీషియన్స్‌పై ఉంటుంది. అందుకే గతంలో సహాయ టెక్నీషియన్ కుర్చీ సరిగ్గా ఈ ప్యానల్ వద్దే ఉండేది. కానీ ప్రస్తుతం టెక్నీషియన్లు ఆ బాధ్యతను బెడ్‌రోల్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. సరైన పరిజ్ఞానం లేని వీరు వాటి పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. శనివారం నాటి ప్రమాదానికి ఇదీ ఓ కారణం కావొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 ఫైర్ సేఫ్టీ అడిట్ ఏమైంది: రైళ్లలో అగ్నిప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంతో దాన్ని నివారించే ఉద్దేశంతో కొద్దికాలం క్రితం ‘ఫైర్ సేఫ్టీ అడిట్’ బృందాలను ఏర్పాటు చేశారు. రెండు బృందాలు విడివిడిగా పనిచేసేలా రెండేళ్ల క్రితం రూపకల్పన చేశారు. ఈ బృందాలు ఆయా రైళ్లను పరిశీలించి వాటిల్లో అగ్నిమాపక వ్యవస్థ ఎలా ఉందో, కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తేల్చి రైల్వే బోర్డుకు నివేదిక అందజేయాలి. కానీ ఇప్పటి వరకు వాటి పనితీరు ఏంటో మూడో కంటికి తెలియదు. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేసి ఉంటే ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో కొన్నింటినైనా నివారించే అవకాశం ఉండేది.
 
 బన్సల్ మేనల్లుడికి లంచం ఇవ్వబోయింది ఆ పోస్టుకే..
 గత రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పవన్‌కుమార్ బన్సల్ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని పదవి పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వే బోర్డులో కీలక పదవి కోసం ఓ అధికారి నుంచి రూ. 10కోట్ల లంచం పుచ్చుకునేందుకు ఒప్పందం చేసుకున్నారనేది ప్రధాన అభియోగం. ఆ అధికారి ఏ పోస్టు కోసం ఈ లంచం ఎరవేశారో తెలుసా? రైల్వే బోర్డులో కీలకమైన ఎలక్ట్రికల్ విభాగం బాధ్యత పొందేందుకే  అతను కోట్లలో లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెండేళ్ల కాలపరిమితి మాత్రమే ఉండే ఈ పోస్టుకు అంత మొత్తం ఇచ్చేందుకు ఎందుకు సిద్ధమయ్యారంటే.. అంతకు ఎన్నో రెట్లు అధికంగా అందులో ‘సంపాదన’ ఉండటమే దీనికి కారణం.
 
 అవినీతికి అంతగా అవకాశం ఇచ్చిన ఆ పోస్టు చేసే పనేంటంటే.. రైళ్లలో, స్టేషన్లలో అమర్చే ఎలక్ట్రికల్ పరికరాల కొనుగోలు లావాదేవీలు చూడటం. మరి లంచం ఇచ్చిన సొమ్ముకు కొన్ని రెట్లు అధిక మొత్తం రాబట్టుకోవాలంటే.. కాంట్రాక్టర్లతో లాలూచీ పడాల్సిందే. అదే జరిగితే.. నాసిరకం పరికరాలు రైళ్లలో ప్రత్యక్షమవుతాయి. ఇంకేముంది.. నిప్పు పుట్టడం, బోగీలు తగలబడటం.. అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవటం.. అన్నీ చకచకా జరిగిపోతాయి. శనివారం నాటి రైలు దుర్ఘటనకు ఇలాంటి నాసిరకం పరికరాలూ ఓ కారణమేనా? అనేది పూర్తి దర్యాప్తులో కాని తేలేవిషయం కాకపోయినా.. రైల్వేలో జరుగుతున్న పరిణామాలు దేన్నీ కొట్టేయలేని పరిస్థితి కల్పిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement