కర్నూలు(హాస్పిటల్): కర్నూలు, అనంతపురం జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా చేసే కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం ధాటికి జిల్లా ఇమ్యునైజేషన్ కార్యాలయం మొత్తం భస్మీపటలం అయ్యింది. ప్రమాదంలో దాదాపుగా రూ.కోటి దాకా నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ ఆవరణలో ఉన్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నల్లటి పొగలు వెలవడ్డాయి. ఆ తర్వాత కొద్దినిమిషాలకే కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో స్థానికులు, అటువైపు వెళ్లేవారు ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జయన్నతో పాటు అధికారులు దేవన్న, కేశవులు బృందం సభ్యులు రెండు ట్యాంకర్లతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే కార్యాలయంలోని అన్ని గదుల్లో మంటలు వ్యాపించాయి. ఒకవైపు మంటలు ఆర్పుతుండగా మరోవైపు వ్యాక్సిన్ కూలర్లు, డీఫ్రీజర్లలోని కంప్రెజర్లు పేలసాగాయి. దీంతో సిబ్బంది కాసేపు అక్కడి నుంచి పక్కకు వచ్చారు. పేలుళ్లు ఆగిపోయాక మళ్లీ వారు మంటలు ఆర్పసాగారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది సైతం వచ్చి మంటలు ఆర్పారు.
భారీ ఎత్తున వ్యాక్సిన్ మంటలకు ఆహుతి
జిల్లా ఇమ్యునైజేషన్ కార్యాలయం నుంచి కర్నూలుతో పాటు అనంతపురం జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తారు. ఫిబ్రవరిలో పల్స్‌పోలియో కార్యక్రమం ఉండటంతో అందుకు సంబంధించి వ్యాక్సిన్ ఇప్పటికే వచ్చింది. ఇప్పటికే అనంతపురం జిల్లాకు పల్స్‌పోలియో వ్యాక్సిన్ పంపించారు. కర్నూలు జిల్లాకు చెందిన 6.4లక్షల డోసుల వ్యాక్సిన్‌తో పాటు రోటావైరస్, ఎంఆర్, డీపీటీ, టీటీ వ్యాక్సిన్లు కొద్దిమోతాదులో నిల్వ ఉన్నాయి. వీటిని మూడు వాక్యూమ్ కూలర్లు, ఐదు ఐఎల్‌ఆర్ ఫ్రిజ్‌లు, 5 డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ సెంటర్లు, మూడు రీజనల్ వ్యాక్సిన్ సెంటర్లలో భద్రపరిచారు. ఇవే గాక పల్స్‌పోలియో కార్యక్రమానికి గాను రిజర్వులో మరో 20 డీఫ్రీజర్లు ఉంచారు. మొత్తం వ్యాక్సిన్, ఫ్రిజ్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ క్యారియర్లు సైతం మంటలకు కాలిపోయాయి. దీంతో పాటు భవనం పలు చోట్ల పగుళ్లు ఇచ్చింది. మరికొన్ని చోట్ల గోడలు పడిపోయాయి. విద్యుత్ వైరింగ్ మొత్తం కాలిపోయింది. ఈ కారణంగా ప్రమాద నష్టాన్ని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.కోటి దాకా నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ప్రమాద నష్టాన్ని అంచనా వేయండి..
ప్రమాద నష్టాన్ని అంచనా వేసి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సంఘటన జరిగిన విషయం తెలుసుకుని ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని డీఐవో, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో ఎవరున్నారు.. ఎలా జరిగింది..ఎంతమేర నష్టం జరిగింది.. ఏయే వ్యాక్సిన్ కాలిపోయిందన్న వివరాలు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment