సాక్షి, తూర్పు గోదావరి: యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలులోని వంటచేసే బోగీలో(ప్యాంట్రీ కార్) మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయడపడ్డారు.
ప్రమాదం జరగడంతో ఐదు గంటలుగా రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. ప్రమాదానికి గురైన రైలును మరికాసేపట్లో గొల్లప్రోలు నుంచి పిఠాపురం తరలించనున్నారు. గొల్లప్రోలు స్టేషన్ వద్ద రెండు రైల్వే లైన్లు మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం ఒకే లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో విజయవాడ-విశాఖపట్నం మద్య రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు రైల్వే అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment