వాకతిప్ప బాధితులను ఆదుకోవాలి
కొత్తపల్లి : వాకతిప్ప బాణసంచా విస్ఫోటంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మృతుల కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు చేస్తున్న ధ ర్నాకు ఆయన మద్దతు పలికారు. తొలుత మృతులకు ఆత్మశాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పించారు. ప్రమాదం జరిగి 36 రోజులవుతున్నా, ఇప్పటి వరకూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయలేదని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన ద్రాక్షారపు చిన్నబుల్లి కుటుంబానికి రూ.మూడు లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు పంపిణి చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోందన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని, ఒక్కొక్క కుటుంబానికి అర ఎకరం కాదని రెండన్నర నుంచి ఐదు ఎకరాల వరకూ భూమి ఇవ్వాలని, మృతుల కుటుంబాల్లో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. సంఘటన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి అన్ని కుటుంబాలకు పార్టీ తరఫున సహాయం అందించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, పిఠాపురం మాజీ ఎంపీపీ కురమళ్ల రాంబాబు, కొత్తపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు మాదిరెడ్డి దొరబాబు, ఎంపీటీసీ సభ్యులు తోటకూర మారెమ్మ, యేడిద పెదతల్లి, ఆనాల సుదర్శన్, తొమ్మండ్ర సురేష్, గోపి సత్యనారాయణ, ఎ.బాబూరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
న్యాయం జరిగే వరకూ పోరాడుతాం
కోటగుమ్మం,(రాజమండ్రి) : కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో జరిగిన బాణ సంచా పేలుడు ప్రమాదంలో మరణించిన 18 కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేలుడు బాధితులను ఆదుకోవడంలో ఎమ్మెల్యే వర్మ విఫలమయ్యారని పేర్కొన్నారు. పేలుడు బాధితురాలు చిన్నితల్లికి కూడా రూ.మూడు లక్షలు చెక్కును అందజేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఐదు ఎకరాల భూమిని మంజూరు చేయాలని కోరారు.
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, హౌసింగ్ బోర్డు ద్వారా పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబంలోని పిల్లలకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ పార్టీలు వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వైరాల అప్పారావు, ఏడో డివిజన్ కార్పొరేటర్ కోరిమిల్లి విజయ శేఖర్, మాదిగ న్యాయవాదుల రాష్ట్ర కన్వీనర్ కొత్తపల్లి ప్రసాదరావు, యార్లగడ్డ అశోక్ , ఉండ్రాజవరపు గోపి, సిమెంట్రీపేట నాయకులు వైరాల రమేష్, రాయి డేవిడ్, ఎన్. రమణ, తదితరులు పాల్గొన్నారు.