చీమకుర్తి : ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డీజిల్ డ్రమ్ములు ఉన్నట్టుండి పేలాయి. గాలిలో తేలుతూ పల్టీలు కొట్టాయి. ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. ఫలితంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు భయంతో బయటకు పరుగులు తీసి క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన చీమకుర్తి నడిబొడ్డున బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది.
వివరాలు.. పాడి ఆంజనేయులు అనే వ్యక్తి గ్రానైట్ క్వారీలకు చెందిన టిప్పర్లు, ట్రాలీల నుంచి అక్రమంగా డీజిల్ సేకరిస్తుంటాడు. అనంతరం డ్రమ్ముల్లో నిల్వ చేసి అడ్డదారిలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంటాడు. పాలపర్తి ప్రభుదాస్ అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని దానిలో డీజిల్ డ్రమ్ములు నిల్వ ఉంచాడు. ఆంజనేయులు వద్ద మస్తాన్(45)తో పాటు మరో 15 మంది పని చేస్తుంటారు. వీరు డీజిల్‌ను సేకరించి డ్రమ్ముల్లోకి మారుస్తూ ఉంటారు.
డీజిల్ డ్రమ్ములు నిల్వ చేసే ఇంట్లో మస్తాన్‌తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. డీజిలే కాకుండా తక్కువ మోతాదులో పెట్రోలు కూడా నిల్వ ఉంచినట్లు సమాచారం. డీజిల్‌ను వేరే డ్రమ్ముల్లోకి మార్చే సమయంలో సిగరెట్ కాలుస్తుండటంతో ప్రమాదవశాత్తూ మంటలు డీజిల్, పెట్రోల్‌కు అంటుకున్నాయి.
ఒక్కసారిగా మంటలు ఇంటి నిండా వ్యాపించాయి. అదే సమయంలో ఇంట్లో డీజిల్‌ను మార్చే ఇద్దరితో పాటు మస్తాన్ భార్య, ఇద్దరు పిల్లలు భయంతో బయటకు పరుగులు తీశారు. మస్తాన్ మాత్రం మంటల్లో చిక్కుకొని కాలి బూడిదయ్యాడు. ఒక్కసారిగా మంటలు పెద్దవి కావడంతో డీజిల్ డ్రమ్ములు పెద్దగా పేలి గాలిలో పల్టీలు కొట్టాయి. చుట్టుపక్కల వందలాది మంది జనం సంఘటన స్థలానికి చేరుకుని భయంతో వణికిపోయారు. తహశీల్దార్ పి.మధుసూదన్‌రావు, ఎస్సై నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అడిషనల్ ఎస్పీ రామానాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
డీజిల్ డ్రమ్ములకు మంటలు
Published Thu, Nov 13 2014 3:26 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM
Advertisement