
మొదటి రోజే ఎదురుచూపులు
వేసవి సెలవులు ముగిశాయి. కాని ఎండలు మాత్రం తగ్గలేదు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి.
నెల్లూరు(టౌన్): వేసవి సెలవులు ముగిశాయి. కాని ఎండలు మాత్రం తగ్గలేదు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. మొదటిరోజు కావడంతో విద్యార్థుల హాజరు స్వల్పంగా ఉంది. అయితే అనేక పాఠశాలలకు విద్యార్థులు నిర్ణీత వేళకే వచ్చినా విద్యార్థులు మాత్రం సమయపాలన పాటించలేదు. చాలా చోట్ల ఉపాధ్యాయులు వచ్చేవరకు విద్యార్థులు గోడలమీద , రాళ్లగుట్టల మీద కూర్చొని ఎదురు చూడసాగారు. కొందరు ఆటపాటలతో గడిపారు. ఇక అనేక పాఠశాలల్లో అయితే
పుస్తకాలను పక్కనపెట్టి చీపుర్లు పట్టి శుభ్రత పనిలో మునిగితేలారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులే ఈ పనులు చేయాలని పురమాయించడం గమనార్హం. నగరంలోని ఈఎస్‌ఆర్‌ఎం పాఠశాలకు విద్యార్థులు వచ్చినప్పటికి గదులు తాళాలు వేసి ఉన్నాయి. ఫత్తేఖాన్‌పేటలోని రామయ్యబడి కి వాచ్‌మన్ సకాలంలో తాళాలు తీసినప్పటికి ఉపాధ్యాయులు సకాలంలో రాక విద్యార్థులు పిట్టగోడమీద కూర్చొని ఉండటం కనిపించింది. కొంతమంది బెంచీలు సర్దుతూ కనిపించారు.
ఈ పాఠశాల తలుపులు తెరుచుకోకముందే ఇస్కాన్ సంస్థ మధ్యాహ్న భోజనం పంపింది. ఆ భోజనం మధ్యాహ్నానికి ఎండ కారణంగా మెత్తబడిపోతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సుంకుచెంగన్న మున్సిపల్ పాఠశాలవద్ద తెగిన విద్యుత్‌వైర్లు రోడ్డుమీద నుంచి పాఠశాల ఆవరణలో పడ్డాయి. విద్యార్థులే వాటిని పక్కకు తొలగించారు. సంతపేటలోని మోడల్ స్కూలులో కుళాయిల వద్ద మురుగు మడుగుకట్టింది. దుర్ఘందం వెదజల్లుతున్న ఆ ప్రాంతంలోనే విద్యార్థులు దాహం తీర్చుకుంటూ కనిపించారు. జిల్లాలోని అనేక పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. 41 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదుకావడంతో పలు చోట్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.