విమానాశ్రయంలో ప్రయాణికులకు మెడికల్ స్క్రీనింగ్ చేస్తున్న సిబ్బంది
సాక్షి, అమరావతి/గన్నవరం: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దశ ‘వందే భారత్ మిషన్’లో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి బుధవారం తొలి విమానం వచ్చింది. లండన్ నుంచి ముంబైకి చేరుకున్న 143 మంది ప్రవాసాంధ్రులను.. అక్కడి నుంచి ఎయిరిండియా విమానంలో ఉదయం 8.15 గంటలకు గన్నవరం తీసుకొచ్చారు. వీరిలో పదేళ్లలోపు పిల్లలు ముగ్గురు, ఏడాదిలోపు చిన్నారులు ఇద్దరు ఉన్నారు.
ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి..
► విమానం నుంచి ప్రయాణికులు దిగిన వెంటనే అత్యంత భద్రత మధ్య ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.
► అనంతరం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి.. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద ప్రయాణికుల వివరాలు నమోదు చేసుకున్నారు.
► ఆ తరువాత ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులను వారి జిల్లాల్లోని ప్రభుత్వ, పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.
► ప్రతి బస్సుకు రెవెన్యూ శాఖకు చెందిన ప్రత్యేక అధికారిని నియమించి పోలీస్ ఎస్కార్ట్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.
► ప్రవాసాంధ్రులు ఎయిర్ పోర్టుకు చేరుకున్న నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, భద్రత దళాలు, ఎయిర్‌లైన్స్, వైద్య సిబ్బంది పీపీఈ సూట్స్ ధరించారు.
సీఎం కృషి ఫలితంగానే..
విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి తీసుకురావడంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. సీఎం కృషి ఫలితంగా వందే భారత్ మిషన్ ఫేజ్–2లో ప్రవాసాంధ్రుల కోసం వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులకు 13 విమానాలు కేటాయించారు. 4వ ఫేజ్‌లో మరిన్ని విమానాలు ఏపీకి రానున్నాయి. త్వరలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన కార్మికులను తీసుకువచ్చేందుకు ఉచిత విమానాలను నడిపే యోచన ఉంది. విదేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు సుమారు 4 వేల మంది ప్రవాసాంధ్రులు ఇప్పటికే ఏపీ ఎన్‌ఆర్‌టీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
– వెంకట్ ఎస్.మేడపాటి, అధ్యక్షుడు, ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు.
ప్రత్యేక కౌంటర్లు
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కీలక శాఖల అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ టెర్మినల్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి ఇమ్మిగ్రేషన్, మెడికల్ టెస్టులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించాం.
– జి.మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్
అప్పుడే వస్తామనుకోలేదు..
విజిటింగ్ వీసా ద్వారా నవంబర్ 19న లండన్‌లోని కుమారుడి వద్దకు వెళ్లాను. తిరిగి వద్దామనుకున్న సమయంలో లాక్‌డౌన్ వల్ల విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయాం. ఇక్కడికి ఎప్పుడు తిరిగి వస్తామో తెలియని పరిస్థితుల్లో తీవ్రంగా ఆందోళన చెందా. అయితే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది.
– వి.సరస్వతి, ఏలూరు
మరిన్ని విమానాలు నడపాలి
యూకేలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో మార్చిలోనే ఏపీకి తిరిగి వద్దామనుకున్నాం. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నాం. వందే భారత్ మిషన్ ఫేజ్–2లో ముంబై మీదుగా విజయవాడకు సర్వీసులు ఏర్పాటు చేయడంతో ఎట్టకేలకు సొంతగడ్డకు చేరుకున్నాం. లండన్‌లో ఏపీకి చెందిన వారి కోసం మరిన్ని సర్వీసులు నడిపితే బాగుంటుంది.
– చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు
అరబ్ ఎమిరేట్స్ నుంచి విశాఖకు 463 మంది రాక
క్వారంటైన్‌కు తరలించిన అధికారులు
అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన వారి లగేజీలను సైతం హైపో క్లోరైట్‌తో శుభ్రం చేస్తున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది
ఎన్‌ఏడీ జంక్షన్ (విశాఖ): ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమం కింద అరబ్ దేశమైన ఖతర్ నుంచి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన 463 మంది ప్రత్యేక విమానాల్లో విశాఖ చేరుకున్నారు. దోహా విమానాశ్రయం నుంచి బుధవారం రాత్రి 149 మంది విశాఖ రాగా.. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు, కర్నూలు 8, కడప 9, తూర్పు గోదావరి 13, పశ్చిమ గోదావరి 6, గుంటూరు 1, కృష్ణా 5, నెల్లూరు 5, ప్రకాశం 4, శ్రీకాకుళం 19, విజయనగరం 11, విశాఖపట్నానికి చెందిన 48 మంది ఉన్నారు. వీరితోపాటు కేరళ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన మరో 20 మంది కూడా విశాఖ చేరుకున్నారు. వీరందరినీ ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్లకు తరలించారు. ఇదిలావుండగా.. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక రెండు విమానాల్లో 314 మంది అరబ్ దేశాల నుంచి విశాఖ చేరుకున్నారు. వీరి కోసం విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజకిషోర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment