అంతర్జాతీయ స్థాయిలో నేడు తొలి ఆట | first international cricket match in vizianagaram | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయిలో నేడు తొలి ఆట

Published Sat, Jan 25 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

అంతర్జాతీయ స్థాయిలో నేడు తొలి ఆట

అంతర్జాతీయ స్థాయిలో నేడు తొలి ఆట

 జిల్లాలో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్
 నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో తలపడనున్న ఇండియా- శ్రీలంక మహిళా జట్లు
 ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న టీ-20 మ్యాచ్
 ఏర్పాట్లు పూర్తి  చేసిన నిర్వాహకులు
 ఆత్మవిశ్వాసంతో  ఆతిథ్య ఇండియా జట్టు
 
 జిల్లా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాలన్న వారి కోరిక తీరబోతోంది. అందుకు నార్త్‌జోన్ అకాడమీ వేదికయింది. విజయనగరం వేదికగా తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ శనివారం జరగనుంది. ఇండియా శ్రీలంక మహిళల టీ-20 మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. శ్రీలంకతో ఇండియా జట్టు తలపడనుంది. విజయనగరంలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయంసాధించినా...విశాఖలో జరిగిన మూడు వన్డేల్లో భారత జట్టు గెలుపొంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.
 
 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ :
 జిల్లా వాసులు  ఉత్కంఠగా ఎదురుచూస్తున్న  శుభముహూర్తం వచ్చేసింది. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌కు విజయనగరం ఆతిత్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌కు డెంకాడ మండలం చింతలవలస సమీపంలో ఉన్న  నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది.  ప్రేక్షకుల్లో ఆద్యంతం ఉత్కంఠరేపే  టీ- 20  క్రికెట్ మ్యాచ్ జిల్లా వాసులకు కనువిందు చేయనుంది.   తొలిసారిగా జిల్లాలో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-శ్రీలంక మహిళా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు విశాఖలో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లు ఆటను పూర్తి చేసుకోగా శనివారం  తొలి టీ-20 క్రికెట్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్  ఉదయం 10 గంటకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతుందని   నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ  నిర్వాహకుడు వి.సన్యాసిరాజు శుక్రవారం తెలిపారు. అంతకుముందు ఉదయం 8 గంటలకు ఇరు జట్ల క్రీడాకారులు బస్సులో  విశాఖ నుంచి మైదానానికి చేరుకుంటారు. రెండు గంటల పాటు  క్రీడాకారులు ప్రాక్టీసు చేసిన అనంతరం మ్యాచ్ ఆరంభం కానుంది.    తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.  
 
 జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి
 విద్యలకు నిలయంగా.. కళలకు కాణాచిగా పేరుగాంచిన విజయనగరం జిల్లా కీర్తిప్రతిష్టలు  ఇకపై అంతర్జాతీయ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. జిల్లా వాసులు ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్న తరుణం రావటంతో ప్రతి ఒక్కరిలో  ఉత్కంఠత నెలకొంది.  జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానాలను పంపిచటంతో పాటు పలువురు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
 
 ఆత్మవిశ్వాసంతో...
 శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం జరగనున్న తొలి టీ-20 మ్యాచ్‌లో  ఆతిథ్య ఇండియా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఇప్పటికే జరిగిన మూడు వన్డేల్లో ఇండియా జట్టు క్లీన్‌స్వీప్ చేసి శ్రీలంక జట్టుపై పైచేయి సాధించగా శనివారం జరగనున్న తొలి టీ-20 మ్యాచ్‌లో ఇదే తరహాలో రాణించి  తొలి విజయాన్ని  దక్కించుకోవాలనే ఉత్సుకతతో  ఉవ్విళ్లూరుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వన్డేలో  ఓటమి పాలై  ఘోర పరాజయం పాలైన శ్రీలంక జట్టు టీ-20 క్రికెట్‌లోనైనా రాణించి  పరువు దక్కించుకోవాలని బావిస్తోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement