బాలాజీచెరువు (కాకినాడ) :నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ పదవ తరగతి ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లాను మొదటిస్థానంలో నిలబెడతానని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు అన్నారు. గత సంవత్సరం పదవ తర గతి ఫలితాల్లో జిల్లా ఉమ్మడిరాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నరసింహారావు డీఈఓగా బాధ్యతలు స్వీకరించి ఐదు నెలలైన సందర్భంగా ‘సాక్షి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది.
ప్రశ్న : జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు ఎంతమంది హాజరౌతున్నారు?
జవాబు : జిల్లావ్యాప్తంగా మార్చి 26న జరిగే పరీక్షలకు 69,510 మంది విద్యార్థులు హాజరౌతున్నారు. రెగ్యులర్‌గా 65,648 మంది, ప్రైవేట్‌గా 3,858 మంది హాజరౌతున్నారు. బాలురు 34,908 మంది, బాలికలు 34,592 మంది పరీక్షలు రాయనున్నారు.
ప్రశ్న : పరీక్షలకు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?
జవాబు : కొత్తగా కలిసిన మండలాలతో కలిపి జిల్లాలో 317 సెంటర్లు ఏర్పాటు చేశాం.
ప్రశ్న : గతంలో ప్రతి పాఠశాలనూ ఒక అధికారికి దత్తతనిచ్చారు. ఈ సంవత్సరం?
జవాబు : క్రితం సంవత్సరం లాగే ఈ సంవత్సరమూ కలెక్టర్ ఆదేశాల మేరకు అలాగే ప్రతి పాఠశాలకూ ఓ దత్తత అధికారిని నియమించాం.
ప్రశ్న : ఈ సంవత్సరం ఫలితాలకు మీ యాక్షన్ ప్లాన్?
జవాబు : ఉత్తీర్ణత శాతం పెంచడంతో పాటు ప్రథమ స్ధానంలో నిలపడమే నా లక్ష్యం. ఇప్పటికే మండలస్థాయిలో కమిటీలు నియమించాం. ప్రీ పబ్లిక్ 1, 2 పరీక్ష ఫలితాల ఆధారంగా ఉత్తీర్ణత శాతం గుర్తించి, ఉత్తీర్ణతలో బాగా వెనుకబడిన పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం.
ప్రశ్న : పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యూయా?
జవాబు : ఇప్పటికే ప్రశ్నాపత్రాలు వచ్చారుు. అన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలతో పాటు తాగునీటి సదుపాయం కల్పించడంతో వెలుతురు బాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మాస్ కాపీయింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. 15 ఫ్లైయింగ్ స్వ్కాడ్‌లు నియమిస్తున్నాం. గత సంవత్సరం మాస్ కాపీయింగ జరిగిన కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం.
ప్రశ్న : పదవ తరగతి విద్యార్థులకు మీరిచ్చే సందేశం?
జవాబు : పదవ తరగతి విద్యాభ్యాసంలో ఎంతో కీలకమైనది. ఈ తరగతిలో వచ్చిన ఫలితాల్ని బట్టే విద్యార్థి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ఒత్తిడికి గురవకుండా మెదడును ప్రశాంతంగా ఉంచుకొని పరీక్షలు రాయాలి. కాపీయింగ్‌కు పాల్పడి భవిష్యత్ నాశనం చేసుకోరాదు. పదవ తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించాలన్నదే నా ఆకాంక్ష.