- తొలిసారి జాతీయ పరీక్షలో మెరిసిన అమ్మాయిలు
- 14వ ర్యాంకు సాధించి ఏపీలో టాపర్‌గా నిలిచిన వైఎస్సార్ జిల్లా విద్యార్థిని
తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత పొందినవారు 15%
టాప్–10లో లేకున్నా టాప్ –100లో ఉన్నవారు 30
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–2017లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్షలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తొలి ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వీరిలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండటం విశేషం. 2017 –18 విద్యా సంవత్సరానికి మే 7న నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 66 వేల మంది, తెలంగాణ నుంచి 44 వేల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. 43 రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూసిన విద్యార్థుల ఉత్కంఠకు ఎట్టకేలకు శుక్రవారంతో తెరపడింది. పలు కోర్టు కేసులతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు శుక్రవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
జాతీయ స్థాయిలో టాప్ వంద ర్యాంకుల్లో 23 మంది (మరికొందరు ఉండే అవకాశం ఉంది) ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం విశేషం. ఆల్ ఇండియా 12వ ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన లక్ష్మిశెట్టి ఆర్నవ్త్రినాథ్ సొంతం చేసుకోగా, కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంజనీర్‌గా పనిచేస్తున్న నర్రెడ్డి నవనీశ్వర్‌రెడ్డి కూతురు నర్రెడ్డి మాన్విత 14వ ర్యాంకు సాధించడం గమనార్హం. సికింద్రాబాద్‌కు చెందిన మంగని దీపిక 24వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్‌కు చెందిన అడుసుమిల్లి వెంకట హేమంత్ 30వ ర్యాంకు సాధించారు.
రెండు మూడు రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు
దేశ వ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో తాజాగా వెల్లడైన ఫలితాలు జాతీయ స్థాయిలోనివి మాత్రమే. రాష్ట్ర స్థాయి ర్యాంకులు నిర్ణయించేందుకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశముందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 27లోగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో (నేషనల్ పూల్‌లో) 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లు పొందడానికి అందరికీ హక్కు ఉంటుంది. అయితే ఆర్టికల్ 371డి నిబంధన వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్ము కాశ్మీర్లకు ఇది వర్తించదు. దీంతో ఈ ప్రాంతాల్లోని మొత్తం సీట్లు అక్కడి విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఏపీలో మాన్వితకు మొదటి ర్యాంకు
నీట్ జాతీయ స్థాయి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలదే హవా కొనసాగింది. మొదటి వంద ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది ఉండగా అందులో 12 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. తొలి 56 ర్యాంకుల్లో 9 మంది అమ్మాయిలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ర్యాంకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్రెడ్డి మాన్విత సొంతం చేసుకుంది. తండ్రి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. మాన్వితకు జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు రాగా, రాష్ట్రంలో మొదటి ర్యాంకు దక్కించుకోనుంది.
500 మార్కులు దాటితేనే అవకాశం
తాజాగా వెల్లడైన నీట్ ఫలితాల సరళిని బట్టి 500 మార్కులు దాటితేనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 1,850 సీట్లుండగా, ప్రైవేటు కశాళాలల్లో 2 వేల పైచిలుకు ఉన్నాయి. ఇందులో వెయ్యి సీట్లు కన్వీనర్ కోటాగా వస్తాయి. అంటే మొత్తం 2,850 సీట్లు ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు లెక్క. సీట్ల సంఖ్యను బట్టి చూస్తే కనీసం 500 మార్కులు అధిగమిస్తేనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాగా, ఒక్కోసారి పర్సంటైల్‌ను బట్టి ర్యాంకులు మారే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
టాప్ 100లో ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలు
పేరు ర్యాంకు ఊరు
లక్ష్మిశెట్టి ఆర్నవ్ త్రినాథ్ 12 హైదరాబాద్
నర్రెడ్డి మాన్విత 14 ప్రొద్దుటూరు
మంగని దీపిక 24 హైదరాబాద్
అడుసుమిల్లి వెంకట హేమంత్ 30 హైదరాబాద్
ఆలేటి అఖిల 32 హైదరాబాద్
పావులూరి సాయి శ్వేత 36 విశాఖపట్నం
జంబుల అనూషారెడ్డి 38 హైదరాబాద్
ఫణి శ్రీలాస్య 51 నెల్లూరు
అంకిత దాస్ 52 విశాఖపట్నం
పారుపతి వర్షారెడ్డి 54 ––––
కొప్పురావూరి ప్రీతి 56 హైదరాబాద్
సాధినేని నిఖిల్ చౌదరి 57 కూకట్పల్లి
గాలివీడు మనోజ్పవన్రెడ్డి 59 హిందూపురం
తెలుగు నీరజ్ పవన్‌రెడ్డి 70 తాడిపత్రి
దేవళ్ల మన్సీ దినేష్ 72 సికింద్రాబాద్
డొక్కు వంశీకృష్ణ 73 రేపల్లె (గుంటూరు)
విశ్వనాథుని చైతన్యగోపాల్ 74 చల్లపల్లి (కృష్ణాజిల్లా)
వేణిగళ్ల శరణ్‌కుమార్ 86 హైదరాబాద్
కెవీఎన్వీఎస్ నేస్తంరెడ్డి 89 కాకినాడ
వీరమాచినేని జైత్రి 90 విజయవాడ
టి.కాత్యాయని గౌడ్ 93 హైదరాబాద్
ఎన్.సాత్వికరెడ్డి 94 కాకినాడ
దాసరి సాయి సౌగంథ్ 98 గద్వాల్
పర్సంటైల్, కటాఫ్ మార్కులు ఇలా
కేటగిరీ పర్సంటైల్ కటాఫ్ మార్కులు అర్హత సాధించిన వారు
ఓసీ 50 697–131 5,43,473
ఓబీసీ 40 130–107 47,382
ఎస్సీ 40 130–107 14,599
ఎస్టీ 40 130–107 6,018
పైన పేర్కొన్నట్టు 697 మార్కులు సాధించిన పంజాబ్‌కు చెందిన వనదీప్ సింగ్‌కు మొదటి ర్యాంకు దక్కింది. అంటే ఇతనికి 99.999908 పర్సెంటైల్ వచ్చింది. అలా చూస్తూ వచ్చినప్పుడు 131 మార్కులు వచ్చిన విద్యార్థి పర్సంటైల్ 50 అవుతుంది. కాగా.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జనరల్ పర్సంటైల్‌లో కూడా ఉండవచ్చు.