సముద్రంలోజారిపడి మత్స్యకారుని మృతి
Published Fri, Sep 6 2013 5:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
గార, న్యూస్‌లైన్ : ఉపాధి కోసం గుజరాత్ రాష్ట్రం వెళ్లి అక్కడ బతుకు వేటలో మృత్యువుకు బలైన మత్స్యకారుడి వైనం మండలంలో విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
గార మండలం కొర్లాం పంచాయతీ కొమరవానిపేట గ్రామానికి చెందిన మైలపల్లి పోలీసు (44) మత్స్యకారుడు. స్థానికంగా ఉపాధి కరువవడంతో తోటి మత్స్యకారులతో కలిసి గుజరాత్ రాష్ట్రంలోని వీరావళి వెళ్లాడు. అక్కడ సముద్రంలో చేపలు వేటాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం తోటి మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లాడు. చేపలకోసం వల విసురుతుండగా జారి కిందపడిపోయాడు. బోటు తగలడంతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసు మరణవార్త విన్న ఆయన భార్య చిట్టెమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. కుటుం భారం పోలీసుపైనే ఉందని గ్రామస్తులు తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు
మైలపల్లి పోలీసు మృతి వార్త గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ ప్రాంతం నుంచి ఉపాధి కోసం వీరావళి, ఇతర ప్రాంతాలకు వెళ్లడం మామూలే అయినా మృతి చెందిన సంఘటనలు తక్కువ. పోలీసు కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ పీస శ్రీహరిరావు, జిల్లా మత్స్యకార సంఘ నాయకుడు మైలపల్లి నర్సింగరావు, పుక్కళ్ల నారాయణ స్వామి కోరారు.
Advertisement