
ప్రమాదానికి గురైన పడవను తీసుకువస్తున్న దృశ్యం
విజయనగరం, పూసపాటిరేగ: చింతపల్లి బర్రిపేటకు చెందిన నాటుపడవ ఆచూకీ భోగాపురం మండలం ముక్కాం సముద్రం రేవులో చింతపల్లి మెరైన్ పోలీసులకు లభించింది. వివరాల్లోకి వెళితే.. చింతపల్లి బర్రిపేట గ్రామానికి చెందిన మైలపల్లి అప్పన్న (30) ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సముద్రంలో వేటకు నాటుపడవపై వెళ్లాడు. చింతపల్లి తీరంలో వేట చేస్తుండగా బోల్తాపడిన నాటు పడవ గాలులకు ముక్కాం తీరం వైపు కొట్టుకెళ్లిపోయింది. అయితే అప్పన్న ఎంత గట్టిగా కేకలు వేసినా సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో ఎముకలు కొరికే చలిలో సుమారు 20 గంటల పాటు గడిపాడు. పడవ గల్లంతు విషయం తెలుసుకున్న మెరైన్ ఎస్సై జి.రామారావు సిబ్బందితో సహా గ్రామానికి చేరుకున్నారు. అనంతరం పలువురు మత్స్యకారులతో 20 ఇంజిన్ పడవలపై గాలించగా.. ముక్కాంనకు 12 కిలోమీటర్లు దూరంలో సముద్రంలో నాటుపడవపై ఉన్న అప్పన్న కనిపించాడు. వెంటనే అతడ్ని క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడ్ని జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినప్పన్న, మత్స్యకార నాయకులు మైలపల్లి సింహాచలం, మైలపల్లి తాతలు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment